- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలోని ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బాసరలోని పవిత్ర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు. నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా.. ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.
తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






