పిచ్చోని చేతిలో రాయిలా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి.. మంత్రి హరీశ్ రావు

by Dishafeatures2 |
పిచ్చోని చేతిలో రాయిలా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి.. మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పిచ్చోని చేతిలో రాయిలా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జహీరాబాద్, సంగారెడ్డి నుంచి పలువురు నేతలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసలైన వారసుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైతే చంద్రబాబు ఆనాడు వ్యవసాయం దండగ అన్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే చాలు అని అంటున్నారని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు కరెంట్ సరిగ్గా ఇవ్వడం లేదని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రేవంత్.. ఇవాళ కాంగ్రెస్ లోకి పోగానే మాట మార్చారని అన్నారు. పార్టీ మారినంత ఆనాడు రేవంత్ మాట్లాడిన మాటలు మారుతాయా అని ప్రశ్నించారు.

మూడు గంటల కరెంట్ ఇస్తే ఒక గుంట కూడా పారదని రైతులు చెబుతోంటే.. రేవంత్ రెడ్డి మాత్రం మూడు గంటలు చాలు అంటూ రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆనాడు విద్యుత్ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య సొంత ఊరిలో కూడా రైతులకు మూడు గంటల విద్యుత్ ఇవ్వని కాంగ్రెస్.. నేడు 24 గంటల కరెంట్ ఇస్తామంటే ప్రజలు నమ్మబోరని అన్నారు. కాంగ్రెస్ అంటే కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు అని తెలిపారు. ఈ తొమ్మిదేళ్లలో రైతుల కోసం, కరెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడిందా అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని చెప్పినా రైతులు వారి మాటలు నమ్మబోరని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed