- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యనగరంలో భక్తి పారవశ్యం.. కన్నుల పండువగా శ్రీరామ శోభాయాత్ర
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో శ్రీరామ శోభాయాత్ర అత్యంత వైభవంగా, భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో శ్రీరామ శోభాయాత్ర అత్యంత వైభవంగా, భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. సీతారాంబాగ్ వద్ద రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కన్నుల పండువగా సాగనుంది.
శ్రీరాముడి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
శోభాయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో శ్రీరామ శోభాయాత్రను ఒక ఉత్సవంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు. భారతీయ సంస్కృతిలో రామాయణానికి ఉన్న విశిష్టతను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆదర్శ కుమారుడిగా, ఆదర్శ పురుషుడిగా శ్రీరాముని జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శోభాయాత్ర ప్రజల ఐకమత్యానికి, భక్తి భావనకు నిదర్శనంగా నిలుస్తోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ మందిరం నుంచి మరో శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది.
3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత..
నగరంలో జరుగుతున్న రాములోరి కల్యాణాలు, శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ భద్రతా వివరాలను వెల్లడిస్తూ.. నగర పరిధిలో మొత్తం 339 ప్రాంతాల్లో నవమి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా సీతారాంబాగ్ నుంచి సాగే శ్రీరామ శోభాయాత్ర కోసం ఏకంగా 3 వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, అనుకున్న సమయానికే శోభాయాత్ర పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని సీపీ తెలిపారు. పండుగ వాతావరణంలో శోభాయాత్ర శాంతియుతంగా ముగిసేలా నగర ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.






