కేబినెట్ విస్తరణలో సర్‌ప్రైజ్ ఎంట్రీ.. హోం శాఖ ఆయనకేనా?

by Naga Rani Yarlagadda |

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు గోల్డెన్ చాన్స్ రాబోతున్నదా? ప్రస్తుత రాష్ట్ర కేబినెట్‌లో ఇప్పటి వరకు ప్రాతినిథ్యంలేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా?

కేబినెట్ విస్తరణలో సర్‌ప్రైజ్ ఎంట్రీ.. హోం శాఖ ఆయనకేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు గోల్డెన్ చాన్స్ రాబోతున్నదా? ప్రస్తుత రాష్ట్ర కేబినెట్‌లో ఇప్పటి వరకు ప్రాతినిథ్యంలేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కేబినెట్‌లోకి తీసుకుని, ప్రయారిటీ ఫోర్ట్ పోలియోగా భావించే హోం శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్‌కు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించిన తర్వాత, మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇందుకు రాహుల్ సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం.

సీఎం సూచనతోనే ఢిల్లీ టూర్

ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్లలేదని, ఆ టూర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ సన్నిహిత అనుచరులు చెబుతున్నారు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లాలి? రాహుల్‌ను ఎప్పుడు కలవాలి? కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి ? అనే అంశాలపై సీఎం రేవంత్ బ్రీఫింగ్ ఉన్నట్టు వారు వివరించారు. ప్రసాద్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు హోంశాఖ ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమికంగా చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ శాఖ సీఎం వద్దనే ఉన్నది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ శాఖను ఎవరికో ఒకరికి అప్పగించక తప్పదు. అందులో భాగంగా తనకు సన్నిహితంగా ఉండే ప్రసాద్‌కు హోంశాఖ ఇవ్వడానికి సీఎం రేవంత్ మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. స్పీకర్ పదవి నుంచి తప్పించి ప్రయారిటీ లేని శాఖ ఇవ్వడం వల్ల రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉందని, హోం శాఖ అప్పగిస్తే విమర్శలకు చాన్స్ ఉండదనే అభిప్రాయంలో ఏఐసీసీ ఉన్నట్టు సమాచారం.

ఉత్సాహంలో ప్రసాద్ కేడర్

కేబినెట్‌లోకి ప్రసాద్ కుమార్‌ను తీసుకుంటారని సంకేతాలు రావడంతో ఆయన సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రసాద్ అన్నను కేబినెట్‌లోకి తీసుకుని, హోం మంత్రి పదవి ఇస్తారు. ఢిల్లీ టూర్ తర్వాత అన్నకు క్లారిటీ వచ్చింది’ అని ఆయనకు సన్నిహితంగా ఉండే లీడర్లు ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ జిల్లాలు, సామాజిక సమీకరణల కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే పలు విమర్శలకు చెక్ పెట్టొచ్చని అధిష్టానం భావిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదని విమర్శ ఉంది. ఇక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికి అవకాశం ఇచ్చినా మళ్లీ రెడ్లకే ప్రయారిటీ ఇస్తున్నారని విమర్శలు వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే ప్రసాద్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఇండవని అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది.

Next Story