డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు.. ఎంపీ లక్ష్మణ్​

by Kema Shiva Kumar |

డీలిమిటేషన్‌ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనలపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు.. ఎంపీ లక్ష్మణ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ రాజ్యాంగ సవరణలు తీసుకురావడం మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన అర్థరహితమని మండిపడ్డారు. "డీలిమిటేషన్ ఎప్పుడైనా జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది. ఆదాయం ఆధారంగా చేయడం అనేది రాజ్యాంగానికే విరుద్ధం. ఇలాంటి ఆలోచన చూసి దేశమంతా నవ్వుకుంటోంది" అని ఆయన ఎద్దేవా చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన 'ఒక వ్యక్తి - ఒక ఓటు - ఒకే విలువ' అనే సూత్రానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ధనిక, పేద, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఓటు విలువ అందరికీ సమానంగా ఉండాలన్నదే రాజ్యాంగ స్ఫూర్తి అని గుర్తు చేశారు. జీఎస్‌డీపీ (GSDP) ఆధారంగా సీట్లు కేటాయించడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారాన్ని లక్ష్మణ్ కొట్టిపారేశారు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఉన్న సీట్లను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని, జనాభా 54 కోట్ల నుంచి 140 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సీట్ల సంఖ్య పెరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయి తప్ప, ఎవరి వాటా తగ్గదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని, పాత 543 సీట్లకే పరిమితం చేయాలని చూడటం ద్వారా మహిళల అవకాశాలను తొక్కేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.

జీహెచ్ఎంసీని ఏ ప్రాతిపదికన మూడు ముక్కలు చేశారు?

"రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న డీలిమిటేషన్‌ను ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి.. జీహెచ్ఎంసీని ఏ ప్రాతిపదికన మూడు ముక్కలు చేశారు? ఈ విభజన చేసే ముందు ఎవరితో చర్చించారు? కనీసం ఒక్క అఖిలపక్ష సమావేశమైనా నిర్వహించారా?" అని లక్ష్మణ్ నిలదీశారు. కేవలం మజ్లిస్ పార్టీ మెప్పు కోసమే, పాత నగరాన్ని ఆ పార్టీకి అప్పగించే కుట్రలో భాగంగానే ఈ విభజన చేశారని ఆరోపించారు. కొన్నిచోట్ల 3 వేల ఓట్లు, మరికొన్ని చోట్ల 30 వేల ఓట్లు ఉన్న డివిజన్లుగా ఇష్టారీతిన విభజించారని మండిపడ్డారు. పీవీ నరసింహరావు వంటి గొప్ప నేతకు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని, డీలిమిటేషన్ ప్రక్రియను ఇంకా ఆలస్యం చేస్తే 2029లో మహిళలకు వచ్చే అవకాశాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 2011 జనాభా లెక్కల ప్రకారం తక్షణమే ఈ ప్రక్రియను అమలు చేయాలని కోరారు.

Next Story