Delhi Liquor Case: కవిత బినామీనే.. స్వయంగా ఆయనే అంగీకరించిన పిళ్లయ్!

by Disha Web Desk 2 |
Delhi Liquor Case: కవిత బినామీనే.. స్వయంగా ఆయనే అంగీకరించిన పిళ్లయ్!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరిలోనూ ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇందులో సౌత్ గ్రూప్ కీలకపాత్ర పోషించిందంటూ ఆరోపిస్తున్న ఈడీ.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారించింది. మాగుంట శ్రీనివాసులు‌రెడ్డి ప్రయోజనాల కోసం పనిచేసిన ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. శరత్‌చంద్రారెడ్డిని మొదట్లోనే అరెస్టు చేసినా.. కవితను మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు. తాజాగా మరింత స్పీడు పెంచిన ఈడీ.. అరుణ్ రామచంద్రణ్ పిళ్లయ్‌నూ అరెస్టు చేసింది. ఆయన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు ప్రస్తావించింది. కవితకు బినామీగా ఉన్నట్టు స్వయంగా పిళ్లయ్ ఒప్పుకున్నారని తెలిపింది. దీంతో పాటు ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఎవరెవరికి ఎంత వాటా ఉన్నదనే విషయాన్ని సైతం పేర్కొంది. ఇప్పటికే కవితకు సన్నిహితంగా వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్న ఈడీ.. తర్వాత ఏం చేయబోతున్నదనేది సస్పెన్స్‌గా మారింది. పిళ్లయ్ అప్రూవర్‌గా మారితే ఏంటనేది అంతకంతకూ ఆసక్తిని పెంచుతున్నది.

‘లిక్కర్ స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నన్ను ఇరికిస్తున్నారు..’

- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవితకు అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ బినామీ. ఇండో స్పిరిట్స్ కంపెనీలో పిళ్లయ్ ఇన్వెస్టు చేసిన రూ.3.40 కోట్లలో కవిత రూ.కోటి సమకూర్చారు. – పిళ్లయ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ.

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూపు కీలక పాత్ర పోషించిందని, ఆ గ్రూప్‌లోని ముగ్గురిలో కల్వకుంట్ల కవిత కూడా ఒకరని, ఆమె తరఫున ప్రతినిధిగా అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. పిళ్లయ్‌తో పాటు బోయిన్‌పల్లి అభిషేక్, గతంలో ఆమె వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు కూడా కవితకు సహకరించారని పేర్కొన్నది. సౌత్ గ్రూపులో కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఉన్నారని ఈడీ పేర్కొన్నది. ఇందులో మాగుంట శ్రీనివాసులు‌రెడ్డి ప్రయోజనాల కోసం పనిచేసిన ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. శరత్‌చంద్రారెడ్డిని మొదట్లోనే అరెస్టు చేసినా.. కవితను మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఆమెకు సన్నిహితులుగా ఉన్న, వ్యాపార సంబంధాలు కలిగిన బోయిన్‌పల్లి అభిషేక్‌ను గతంలోనే అరెస్టు చేయగా, తాజాగా అరుణ్ పిళ్లయ్‌ను అరెస్టు చేసింది. వ్యక్తిగత ఆడిటర్‌గా ఉన్న బుచ్చిబాబును సీబీఐ కస్టడీలోకి తీసుకుని ఇప్పటికే విచారణ పూర్తిచేసింది. కవిత చుట్టూ ఉన్న వ్యక్తులను దర్యాప్తు సంస్థలు చుట్టుముట్టేశాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడంతోనే కవిత కూడా త్వరలో అరెస్టవుతారన్న చర్చలు, ఊహాగానాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చుట్టూ ఉన్నవారిని ఒక్కొక్కరిగా సీబీఐ, ఈడీ అరెస్టు చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో, పలువురి రిమాండ్ రిపోర్టుల్లో ఆమెకు ఈ స్కామ్‌లో ఎలాంటి ప్రమేయం ఉన్నదో వివరాలతో సహా వెల్లడించాయి.

ఇండో స్పిరిట్స్‌లో వాటా

పిళ్లయ్‌ను అరెస్టు చేసిన తర్వాత స్పెషల్ కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో.. కవితకు ఈ స్కామ్‌లో ఉన్న సంబంధాలకు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవితకు లబ్ధి కలిగించేందుకు అరుణ్ పిళ్లయ్ అన్నీ తానై వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూపును అరుణ్ పిళ్లయ్ దగ్గరుండి నడిపించారని పేర్కొన్నది. సౌత్ గ్రూపునకు, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య రాజకీయ అవగాహన కుదర్చడంలో పిళ్లయ్ కీలక భూమిక పోషించారని పేర్కొన్నది. సౌత్ గ్రూపు నుంచి అడ్వాన్సుడ్ కిక్ బ్యాక్‌లను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరవేశారని, అనేక మార్గాల్లో ముడుపులను ముట్టచెప్పారని పేర్కొన్నది. చివరకు లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత లాభాలను తిరిగి రాబట్టుకోవడంలో పిళ్లయ్ పాత్ర కీలకమైనదని వ్యాఖ్యానించింది. ఈ పని చేసినందుకుగాను ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత తరఫున 32.5% వాటాను పిళ్లయ్ చేజిక్కించుకున్నారని, మాగుంట శ్రీనివాసులురెడ్డికి మరో 32.5% వాటా లభించినట్టు ఈడీ ఆరోపించింది.

పిళ్లయ్ వాటాలన్నీ కవిత బినామీ పెట్టుబడులేనని, ఇండో స్పిరిట్స్ కంపెనీలో షేర్ హోల్డర్‌గా కాగితాల మీద చూపించడానికి అవసరమైన రూ.3.40 కోట్ల పెట్టుబడిలో రూ.కోటి కవిత సమకూర్చినట్టు పేర్కొన్నది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తొమ్మిది రిటైల్ జోన్లకు లైసెన్సులు రావడానికి పిళ్లయ్ అటు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు, ఇటు సౌత్ గ్రూపు సభ్యులకు మధ్య వారధి పాత్ర పోషించారని పేర్కొన్నది. ఢిల్లీలోని గౌరి అపార్ట్‌మెంట్స్‌లో 2021 మేలో జరిగిన మీటింగులో పిళ్లయ్, అభిషేక్, బుచ్చిబాబు సౌత్ గ్రూపు తరఫున పాల్గొన్నారని, ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారని తెలిపింది. ఆ తర్వాత జూన్ 2021లో ఈ ముగ్గురూ కలిసి సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్స్ అధినేత), శరత్‌చంద్రారెడ్డి మధ్య మీటింగును అరేంజ్ చేసినట్టు ఈడీ తెలిపింది. తన స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్‌లో ఢిల్లీ చేరుకున్న శరత్‌చంద్రారెడ్డి.. పిళ్లయ్, బుచ్చిబాబు, అభిషేక్ సెప్టెంబరు 2021లో తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన మీటింగులో బినయ్ బాబు, మాగుంట శ్రీనివాసులురెడ్డితో కలిసి లిక్కర్ వ్యాపారంపై చర్చించారని తెలిపింది. హోటల్ రికార్డులు, వీడియో ఫుటేజీ ఇందుకు ఆధారాలని ఈడీ వివరించింది. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్‌లో ఐటీసీ కోహినూర్ హోటల్‌లో సమావేశమయ్యారని పేర్కొంది.

అందులో భాగంగానే రూ.31 కోట్లను అభిషేక్, దినేష్ అరోరా కలిసి ఢిల్లీకి బదిలీ చేశారని వివరించింది. ఈ ఒప్పందంలో భాగంగానే సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో సౌత్ గ్రూపునకు దక్కిన 65% వాటాలో కల్వకుంట్ల కవితకు 32.5% (బినానీ పిళ్లయ్ పేరుమీద) దక్కినట్టు తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం హోల్‌సేల్ లిక్కర్ కంపెనీల లాభాల వాటా 12%కి పెంచుతూ ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో మార్పులు జరిగాయని ఈడీ వివరించింది. ఆ ప్రకారం తొలి మూడు స్థానాల్లో నిలిచి లైసెన్సులు పొందిన ఇండో స్పిరిట్స్, బ్రిండ్‌కో, మహదేవ్ లిక్కర్స్ అనే కంపెనీల వ్యాపారం సుమారు రూ.3,500 కోట్లుగా అంచనా వేసినట్టు తెలిపింది. ఇందులో 12% వాటా రూ.420 కోట్లు అయితే తిరిగి 6% (దాదాపు రూ.210 కోట్లు) ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులుగా చెల్లించాలన్నది ఆ ఒప్పందంలో భాగమని ఈడీ పేర్కొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రతినిధిగా విజయ్ నాయర్‌కు సౌత్ గ్రూపు తరఫున పిళ్లయ్, అభిషేక్, బుచ్చిబాబు రూ.100 కోట్లను అడ్వాన్సుగా సమకూర్చారని వివరించింది. ఇందుకోసం పిళ్లయ్ సుమారు రూ.296.2 కోట్ల మేర ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్‌కు పాల్పడినట్టు పేర్కొన్నది.

ఎవరీ అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్?

రాబిన్ డిస్టిల్లరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ అనే లిక్కర్ వ్యాపార కంపెనీల్లో బోయిన్‌పల్లి అభిషేక్‌తో కలిసి అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ రెండు కంపెనీలకు ఆడిటర్‌గా గోరంట్ల బుచ్చిబాబు వ్యవహరించారు. కల్వకుంట్ల కవిత కంపెనీలకు, వ్యక్తిగతంగానూ బుచ్చిబాబు ఆడిటర్‌గా గతంలో వ్యవహరించారు. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా సీబీఐ, ఈడీ హైదరాబాద్ నగరంలో జరిపిన పలు సోదాల్లో గోరంట్ల బుచ్చిబాబుకు చెందిన ఆడిటర్ కంపెనీ కూడా ఉన్నది. ఇప్పటివరకు ఈడీ ఈ కేసుకు సంబంధించి మొత్తం 189 సోదాలు నిర్వహించింది. గతంలో కల్వకుంట్ల కవిత తిరుమల పర్యటనలో పిళ్లయ్, అభిషేక్ పాల్గొన్నారు. వ్యాపారవేత్త అయిన పిళ్లయ్.. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించే విజయ్ నాయర్, ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్ మహేంద్రుకు కల్వకుంట్ల కవితను పరిచయం చేశారు.

అప్రూవర్‌గా మారనున్న పిళ్లయ్?

లిక్కర్ స్కామ్‌లో సీబీఐ గతంలో అరెస్టు చేసిన దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారారు. రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు కూడా సీబీఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దినేశ్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పలువురిని సీబీఐ అదుపులోకి తీసుకున్నది. మరికొందరిని అరెస్టు చేసింది. ఆ క్రమంలోనే పిళ్లయ్‌ను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. ఇప్పటివరకు మొత్తం 29 సార్లు విచారించినట్టు ఆయన తరఫు న్యాయవాది స్పెషల్ కోర్టుకు తెలిపారు. చివరకు సోమవారం అర్ధరాత్రి పిళ్లయ్‌ను ఈడీ అరెస్టు చేసి కోర్టు అనుమతితో వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నది. ఈ క్రమంలో పిళ్లయ్ అప్రూవర్‌గా మారితే అనే చర్చలు మొదలయ్యాయి. అప్రూవర్‌గా మారడానికి పిళ్లయ్.. మానసికంగా సిద్ధమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ఈడీ వర్గాల నుంచి సూచనప్రాయంగా అందుతున్న సమాచారం.

పిళ్లయ్ అప్రూవర్‌గా మారితే లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూపు ప్రమేయంతో పాటు అందులో సభ్యురాలిగా ఉన్న కవితకు సంబంధించి పూర్తి వివరాలు ఈడీకి అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పిళ్లయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో తాను కల్వకుంట్ల కవితకు ప్రతినిధిని అని, సౌత్ గ్రూపు తరఫున ఆమె ఆదేశం మేరకు రాయబారం నడిపినట్టు పిళ్లయ్ అంగీకరించారు. మరోవైపు కవితకు ఆయన బినామీ అంటూ ఈడీ నొక్కిచెప్పింది. పలువురి నుంచి రికార్డు చేసిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ ఆమెపై ఈ అభియోగం మోపింది. పిళ్లయ్ ఈడీ కస్టడీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. సౌత్ గ్రూపులో కీలకమైనవారంతా ఇప్పటికే అరెస్టు కాగా కవిత మాత్రమే మిగిలారు. రానున్న కాలంలో ఆమెకు లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ నుంచి ఎలాంటి ఉచ్చు బిగుస్తుందన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్టు కావడం ఖాయమంటూ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఒకరిద్దరు నేతలు ఉగాది పండుగ లోపే అరెస్టు తప్పదంటూ వ్యాఖ్యానించారు. కవిత చుట్టూ ఉన్న వ్యక్తులంతా సీబీఐ, ఈడీ అదుపులోనే ఉండడంతో ఇక ఆమెకు ముప్పు తప్పదని దర్యాప్తు సంస్థలు సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పటివరకూ దర్యాప్తు ఎలా ఉన్నా ఇకపైన జరిగే పరిణామాలపైనే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఏ పరిణామాన్ని రాజకీయంగా ఎలా వినియోగించుకోవాలన్నాదానిపై దృష్టి సారించాయి.


Next Story

Most Viewed