కొందరు ఓడినా పదవులను వీడటం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ప్రస్తుత కాలంలో కొందరు నాయకులను ప్రజలు ఎన్నికల్లో ఓడించినప్పటికీ, వారు పదవులను మాత్రం వదులుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొందరు ఓడినా పదవులను వీడటం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో కొందరు నాయకులను ప్రజలు ఎన్నికల్లో ఓడించినప్పటికీ, వారు పదవులను మాత్రం వదులుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు న్యాయ వ్యవస్థలో విశిష్ట ముద్ర వేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు’ లభించింది. ఈ మేరకు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఇవాళ అవార్డు ప్రదానోత్సవ వేడుకను అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు.

500 ఎకరాలను పంచిపెట్టిన మహనీయుడు రావి..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి నిబద్ధత గల వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వడం ద్వారా రావి నారాయణ రెడ్డి స్మృతికి నిజమైన గౌరవం లభించిందని కొనియాడారు. తమ ప్రభుత్వం రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితోనే పనిచేస్తోందని తెలిపారు. నాడు నిజాం పాలకుల అరాచకాలు, రాచరిక పోకడలకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి సాగించిన పోరాటం అనన్యసామాన్యమని పేర్కొన్నారు. ఆయన తనకున్న 500 ఎకరాల సొంత భూమిని పేదలకు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజల స్వేచ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు తప్పదని, ఆ ప్రజా పోరాటమే సాయుధ పోరాటంగా మారుతుందని ఆయన చాటిచెప్పారని సీఎం వివరించారు.

నాడు జైపాల్ రెడ్డి ఓటమికి నేనే కారణం..

చరిత్రలో స్వేచ్ఛ కోసం పోరాడిన గొప్ప నాయకులను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. తొలి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి, ఆ తర్వాత కాలంలో స్వచ్ఛందంగా ఎన్నికల నుంచి తప్పుకున్నారని కొనియాడారు. ఈ తరం నాయకులకు జైపాల్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి వారు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘జైపాల్ రెడ్డి గారితో నాకు రాజకీయ సంబంధాలు తక్కువే. 2014 ఎన్నికల్లో ఆయన 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి నేనే కారణం. అయినప్పటికీ ఆయన నన్ను ఎప్పుడూ దూషించలేదు’ అని తన పాత జ్ఞాపకాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

అనంతరం అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి ‘భారత రాజ్యాంగం - భావప్రకటన స్వేచ్ఛ’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువల పరిరక్షణ ఎంత అవసరమో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ నేతలు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story