- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక న్యాయమే ప్రభుత్వ ధ్యేయం : డెహ్రాడూన్ లో మంత్రి సీతక్క
సామాజిక న్యాయమే ప్రభుత్వ ధ్యేయమని, అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర గ్రామీణాభివ్రుద్ది, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సామాజిక న్యాయమే ప్రభుత్వ ధ్యేయమని, అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర గ్రామీణాభివ్రుద్ది, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం సామాజిక న్యాయం, సాధికారత పై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డా.వీరేంద్ర కుమార్ అధ్యక్షతన డెహ్రాడూన్‌లో నిర్వహించిన చింతన్ శివిర్ కార్యక్రమంలో సీతక్క ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం చేస్తున్న కృషిని వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయమన్నారు. ఆ దిశలో రెండు కీలక బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను 42 శాతం వరకు పెంచడంతో పాటు, 30 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినట్లు వెల్లడించారు.సామాజిక న్యాయ సాధన దిశలోనే ప్రజా ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
రాష్ట్రంలో వయవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలను వివరించారు. ఆయా వర్గాల సంక్షేమం కోసం కేంద్ర సహకారాన్ని అభ్యర్థించారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రూ. 300 కోట్లతో రాజీవ్ యువ వికాసం ద్వారా 25 వేల మందికి స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంతోపాటు ప్రతి రంగంలో దివ్యాంగులకు జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. 32.69 లక్షల మంది వయోవృద్ధులకు నెలవారి పెన్షన్ కోసం గతేడాది రూ.3056.94 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ప్రతి జిల్లాలో మైత్రి క్లినిక్‌ల ఏర్పాటుతోపాటు 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్‌గా నియమించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికార శాఖ జాయింట్ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.






