బార్ కోడ్‌తో ‘స్మార్ట్’ రేషన్ కార్డులు! కొత్తగా జారీ చేసేందుకు సర్కారు ప్లాన్

by Rajesh |
బార్ కోడ్‌తో ‘స్మార్ట్’ రేషన్ కార్డులు! కొత్తగా జారీ చేసేందుకు సర్కారు ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్టేట్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆహార భద్రత కార్డుల డిజైన్‌ను మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. పాత రేషన్ కార్డుల స్థానంలో.. ‘టీజీ’ ప్రింట్‌తో కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బార్ కోడ్‌తో.. ఈజీ యాక్సెస్ చేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొత్త కార్డు స్వరూపంపై సర్కారు ఆఫీసర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు కాస్త బ్రేక్ పడినట్లు చర్చ జరుగుతున్నది. కోడ్ ముగిసిన తర్వాత కసరత్తును స్పీడప్ చేసి.. ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

స్మార్ట్ కార్డు తరహాలో..

రాష్ట్రంలో ప్రస్తుతం 89,98,546 ఆహార భద్రత కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఓ చిన్న పుస్తకంలా ఉండేది. అందులో యజమాని ఫొటో, కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రైతుబంధు పాస్‌బుక్‌ సైజ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసింది. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చింది. వెనుకవైపు చిరునామా, ఇతర వివరాలు రాసి ఉండేవి.

తర్వాత ఒక్క పేజీగానే ఉన్న కార్డుల్లో ఒక వైపు కార్డుదారుడు, కుటుంబ సభ్యులు, రేషన్‌ దుకాణం, కార్డు సంఖ్యను ముద్రించారు. వెనకవైపు చిరునామా, ఇతర వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం కొత్తగా జారీ చేసే రేషన్ కార్డు స్మార్ట్ కార్డు తరహాలో బార్ కోడ్‌తో రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ కార్డులో మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వ పథకాలతోపాటు బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది.

ఆరోగ్యశ్రీ కోసం సెపరేట్..

ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ కార్డులను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. అవి అందరికీ అందకపోవడంతో రేషన్ కార్డులను సైతం ఆరోగ్యశ్రీ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సైతం అదే పద్ధతి కొనసాగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. మరోవైపు రేషన్ కార్డులతో సంబంధం లేకుండా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. వైద్య ప్రయోజనాల వివరాలతో వాటిని రూపొందిస్తున్నట్లు సమాచారం.

కొత్త దరఖాస్తుల అప్రూవల్ పై సందిగ్ధత

రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే కీలకంగా మారడంతో గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు లేని అర్హులంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ‘ప్రజాపాలన-అభయహస్తం’ పేరుతో ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకరించగా.. లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. పాత వాటి స్థానంలో కొత్త కార్డుల జారీకి కసరత్తు చేస్తుండగా.. కొత్త దరఖాస్తుల అప్రూవల్‌పై మాత్రం సందిగ్ధత నెలకొన్నది.

ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాతే..

ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కోడ్ ముగిశాక కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీ, మార్పులు చేర్పులు, డిజైన్‌పై అధికారులతో చర్చించి ప్రక్రియను స్పీడప్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే మంత్రి వర్గ సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి ఆమోదం లభించనుంది.

Next Story