ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మౌనం! కీలక అంశాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నం

by Ramesh Naini |

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు శనివారం రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మౌనం! కీలక అంశాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు శనివారం రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం నుంచే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లను ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారనేది ప్రధానంగా విచారిస్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలోని డేటాను ఎందుకు ధ్వంసం చేశారు? ఆ హార్డ్ డిస్క్‌లను ఎక్కడ పడేశారు? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా మూడు ప్రైవేట్ వార్ రూమ్‌లను, ప్రైవేట్ సర్వర్లను నిర్వహించారనే ఆరోపణలపై ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు.

ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసులో మరికొంతమంది రాజకీయ నాయకులకు లేదా ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో నాలుగు జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్‌కు సంబంధించిన రెండు ఖాతాల పాస్‌వర్డ్‌లను గుర్తించారు. ఈ ఖాతాల్లో కనిపించని డేటాను ఫోరెన్సిక్‌కు పంపించారు. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. విచారణలో భాగంగా కొన్ని కీలక ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనంగా ఉంటున్నారని, సమాచారం దాట వేస్తున్నట్లు తెలుస్తుంది. 19వ తేదీన సుప్రీంకోర్టుకు పురోగతి నివేదికను సమర్పించాల్సిన నేపథ్యంలో సిట్ అధికారులు కీలక అంశాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story