- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగూరు ప్రాజెక్టు టూరిజం అభివృద్ధిపై మంత్రి దామోదర రాజనర్సింహా కీలక ప్రకటన
సంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు.

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శుక్రవారం 9వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సంగారెడ్డిలోని పోలీసు పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుద్దేశించి మంత్రి దామోదర మాట్లాడుతూ నెహ్రూ, ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగుతున్నదన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత నైపుణ్యంతో కూడిన ఉపాధి, అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ది, సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు.
సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు కాలువలకు ఈ ప్రాంతానికి సేవలు చేసిన మాజీ మంత్రి సిలారపు రాజనర్సింహా పేరు పెట్టుకున్నామన్నారు. ఈ కాలువలకు సంబంధించి సీసీ లైనింగ్ కోసం రూ.168 కోట్లు విడుదల చేస్తూ అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా సింగూరు ప్రాజెక్టును రూ.100 కోట్లతో టూరిజం సర్కూట్‌గా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు.
రూ.600 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్స్ స్కూల్స్ :
అందోల్, నారాయణఖేడ్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో రూ.600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్స్ స్కూల్స్ నిర్మించబోతున్నామని ప్రకటించారు. జిల్లాలో 1264 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికి అవసరమైన ఉచిత పాఠ్య ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు, యూనిఫాం దుస్తులను అందించడం జరిగిందన్నారు. ఐటీఐ విద్యార్థులలో నూతన సాంకేతిక పరిజ్ణానం, పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాన్ని పెంపొందించడానికి జిల్లాలో రూ.107 కోట్లతో మూడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాయికోడ్, నారాయణఖేడ్, జహీరాబాద్ మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సీఎస్ఆర్ నిధులతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో మౌళిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రూ.293 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు
జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు రోడ్లు అనుసంధానంలో భాగంగా రూ.293 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వివిధ రహదారుల మరమ్మతులకు రూ.22 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తాటిపల్లి నుంచి మక్తక్యాసారం రోడ్డుకు కలుపుతూ సింగితం నుంచి కోడూరు వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.42 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో హెచ్ఏఎం పద్ధతిలో రహదారులు అభివృద్ధి చేయడానికి 105 పనులతో 343 కిలోమీటర్లకు ప్రణాళికలు సిద్ధం చేయడమైందని ప్రకటించారు.
రూ.910 కోట్లతో జిల్లా రైతులకు రుణమాఫీ :
పేదల ఆకలి తీర్చటంతో పాటు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు జిల్లాలో 14,391 మంది లబ్దిదారులకు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 2,791 మంది లబ్దిదారులకు రూ.28కోట్ల 58 లక్షలు వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడే శ్రమ జీవి రైతన్నను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందన్నారు. జిల్లాలో 1,04,016 మంది రైతు కుటుంబాలకు రూ.910 కోట్ల 40 లక్షలు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి రూ12వేల పెట్టుబడి సాయం అందించామన్నారు. భూ భారతి కింద భూసమస్యల పరిష్కారానికి జిల్లాలోని 28 మండలాలు, 596 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిచడం జరిగిందని, ఇప్పటి వరకు 991 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. జిల్లాలో నూతనంగా 206 మంది అర్హులైన అభ్యర్థులకు గ్రామ పాలన అధికారులుగా నియమించామన్నారు.
తెలంగాణ మహిళలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సంగారెడ్డిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సౌజన్యంతో జిల్లా మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ బంకు విజయవంతంగా నడుస్తుందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూళనకై సంగారెడ్డి నార్కోటిక్ అనాలసిస్ బ్రాంచ్ ద్వారా జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కపాదం మోపడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు్న్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికి అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ జిల్లా యంత్రాగానికి శుభాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య, ఎస్సీ పరితోష్ పంకజ్, అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






