- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సినీ ఇండస్ట్రీ టెర్రర్ స్కామ్’ ప్రకంపనలు: గచ్చిబౌలి ఎస్సైపై వేటు వెనుక మాఫియా హస్తం?
నాలుగు రాష్ట్రాల సినీ ఇండస్ట్రీని వేల కోట్ల టెర్రర్ స్కామ్ వణికిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేల కోట్ల రూపాయల టెర్రర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా రంగుల లోకంలోకి అడుగుపెట్టాలనుకునే యువతను, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆశిస్తున్న ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని ఓ భారీ మాఫియా నెట్‌వర్క్ విధ్వంసం సృష్టిస్తోంది. అయితే ఈ కేసులో కీలక నిందితురాలు మాధవిని అరెస్టు చేసి, దర్యాప్తును వేగవంతం చేసిన గచ్చిబౌలి సబ్ ఇన్‌స్పెక్టర్ శివారెడ్డిని అకస్మాత్తుగా కేసు నుంచి తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పలుకుబడి, ధన బలంతో మాఫియా శక్తులు దర్యాప్తు అధికారిని బదిలీ చేయించాయని, దీనివల్ల గత రెండు నెలలుగా కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధితుడు ఆకాశ్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గచ్చిబౌలి డీసీపీకి లేఖ రాస్తూ.. ఎస్సై శివారెడ్డిని తిరిగి కేసు దర్యాప్తులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మాధవి విచారణతో కదిలిన డొంక..
ఎస్సై శివారెడ్డి కేసు దర్యాప్తు చేసి.. స్కామ్‌లోని కీలక వ్యక్తి అయిన మాధవిని పట్టుకున్నారు. ఆమెను విచారించగా.. ఈ మోసపూరిత సంస్థ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం విస్తరించి ఉన్నట్లు వెల్లడైంది. పోలీసుల నిఘా తమపై తీవ్రంగా ఉందని సంస్థ నాయకత్వానికి మాధవి సమాచారం అందించడంతో, అప్రమత్తమైన మాఫియా శక్తులు తమ రాజకీయ బలాన్ని ప్రయోగించి శివారెడ్డిని స్టేషన్ నుంచి, కేసు నుంచి తప్పించినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదని, దీన్ని ఒక టెర్రరిస్ట్ స్కామ్ ఆర్గనైజేషన్‌గా పరిగణించాలని కోరుతున్నారు. ఈ ముఠాకు వ్యతిరేకంగా ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తున్నట్లు అనుమానం వస్తే, వారిని అదృశ్యం చేయడం లేదా చంపేయడం వంటి నేరాలకు ఈ దుండగులు వెనుకాడటం లేదని ఆకాశ్ వర్మ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు.






