- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
మహిళా స్వయం సహాయక సంఘాల విజయాన్ని ఆదర్శంగా తీసుకుని, దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా స్వయం సహాయక సంఘాల విజయాన్ని ఆదర్శంగా తీసుకుని, దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దివ్యాంగుల కోసం ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను (ఎస్ హెచ్ జీ) ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. దివ్యాంగుల లో ఉన్న ఒంటరితనాన్ని తొలగించి, వారిని సమాజంలో భాగస్వామ్యులు గా నిలబెట్టి, ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ స్వయం సహాయక సంఘాలు రూపుదిద్దుకుంటున్నాయి.
4,800 సంఘాలు.. 50 వేల మంది సభ్యులు..
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 50 వేల మందికి పైగా దివ్యాంగులను గుర్తించారు. వారిచే 4800 సంఘాలను ఏర్పాటు చేసి సభ్యులుగా చేర్పించాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా దివ్యాంగుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీలైనంత మేర అర్హులను గుర్తించిన తర్వాత, దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత
దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులు గా చేరవచ్చు. అయితే, మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, సంఘాల్లో అధ్యక్షులుగా మహి ళలే ఉండేలా నిబంధనలు రూపొందించారు. దీని ద్వారా మహిళా దివ్యాంగుల నాయకత్వం బలోపేతం అవుతుంది.
ఆర్థిక స్వావలంబన దిశగా కీలక అడుగులు..
ఈ సంఘాల ద్వారా సభ్యులు చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు పొందే అవకాశాలు కల్పిస్తారు. అలాగే, బ్యాంకు లింకేజీ సౌకర్యం ద్వారా రుణ సదుపాయాలు, ఆదాయ వృద్ధికి తోడ్పడే ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. త్వరలో మహిళా సంఘాల తరహాలోనే దివ్యాంగుల సంఘాల ఖాతాల్లో రివాల్వింగ్ ఫండ్ జమ చేయడానికి సెర్ప్ కసరత్తు మొదలుపెట్టింది.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
మంత్రి సీతక్క ఆదేశాలతో క్షేత్ర స్థాయి అధ్యయనం పూర్తి చేసిన సెర్ప్, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్రంలో ఐఎంఎస్ సక్సెస్..
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల సక్సెస్ కు ఆదర్శంగా నిలిచిన ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) కార్యక్రమం ద్వారా ఇప్పటికే రాష్ట్ర మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతి ఏడాది రూ.25 వేల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు పొందుతున్న ఈ సంఘాలు, సకాలంలో వడ్డీలు చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రమాద బీమా, లోన్ బీమా వంటి పథకాలతో పాటు మహిళలకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోంది. దీంతో మహిళలు ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి వినూత్న వ్యాపారాల్లో ముందంజ వేస్తున్నారు.
దయ కాదు, సమానత్వమే మా లక్ష్యం: మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల ఎస్ హెచ్ జీ ల ద్వారా దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగా ఆర్థికంగా ఎదిగి, సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదిస్తారని మంత్రి సీతక్క విశ్వాసం వ్యక్తం చేశారు. దివ్యాంగులు తమ సొంత ప్రతిభ, కృషి, పట్టుదలతో జీవితాన్ని నిర్మించుకునే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు వేదికలవుతాయని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. దివ్యాంగుల్లో ఆర్థిక స్వావలంబన తో పాటు సామాజిక గౌరవం పెంపొందించడమే తమ లక్ష్యమని, ఈ దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు.
- Tags
- disabled






