అప్రధాన్య పోస్టులలో సీనియర్ ఐఏఎస్‌లు.. ఆయనకు మాత్రం అందలం!

by Kema Shiva Kumar |

కృష్ణ భాస్కర్ ​2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంకు ఓఎస్‌డీగా, ట్రాన్స్‌కో సీఎండీగా, సింగరేణి సీఎండీగా ఏకకాలంగా మూడు శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అప్రధాన్య పోస్టులలో సీనియర్ ఐఏఎస్‌లు.. ఆయనకు మాత్రం అందలం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణ భాస్కర్ ​2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంకు ఓఎస్‌డీగా, ట్రాన్స్‌కో సీఎండీగా, సింగరేణి సీఎండీగా ఏకకాలంగా మూడు శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక, విద్యుత్ శాఖల్లో కీలక పోస్టుల్లో ఉన్న ఆఫీసర్ ఎవరైనా బదిలీ అయితే ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మక పోస్టులైన ట్రాన్స్‌కో సీఎండీ, సింగరేణి సీఎండీ లాంటి కీలక పదవులను గతంలో ప్రిన్సిపల్​సెక్రెటరీ కేడర్​స్థాయి అధికారులే చూసే వారు. కనీసం సెక్రెటరీ హోదా కూడా లేని కృష్ణ భాస్కర్​మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కాని విషయమని ఉన్నతాధికారులు, ఉద్యోగులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కీలక పోస్టులు ఇవ్వడంలో ఆంతర్యమేంటి?

వేల మంది ఉద్యోగులు, రూ.వేల కోట్ల టర్నోవర్​ఉండే సింగరేణి, ట్రాన్స్‌కో లాంటి సంస్థ బాధ్యతలను కృష్ణ భాస్కర్‌కు ఎలా అప్పగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐఏఎస్‌ల్లో అనేక మంది సీనియర్లు నేటికీ​అప్రధాన్య పోస్టుల్లో కొనసాగుతున్నారు. కానీ కృష్ణ భాస్కర్‌‌కు మాత్రం కీలక పోస్టులు ఇవ్వడంలో ఆంతర్యమేంటని పలువురు సీనియర్ ఐఏఎస్‌లు ప్రశ్నిస్తున్నారు. ఏ ఐఏఎస్​అధికారి అయినా రెండు, మూడు కీలక శాఖల్లో ఉన్నప్పుడు దేనిపైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ట్రాన్స్‌కోలో రెగ్యూలర్​సీఎండీకే క్షణం తీరిక ఉండదు. అలాంటిది ఆ శాఖకు సైతం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై విద్యుత్​శాఖ ఉద్యోగులు, అధికారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం దగ్గర నిత్యం ఏదో శాఖ, మంత్రివర్గ ఉప సంఘాల సమావేశాలు, సమీక్షలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించలేక, ఇటు కీలక శాఖలకు న్యాయం చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే బాధ్యతలు అప్పగించే టైంలో అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. తాను సైతం పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని కృష్ణ భాస్కర్ పలుమార్లు సహచర అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఏదో ఒక శాఖకు అధికారిగా నియమిస్తే పూర్తి స్థాయి సమయం కేటాయించి ఒత్తిడి లేకుండా పనిచేసుకోగలుగుతానని ఆయన చెబుతున్నట్టు సమాచారం.

బీఆర్‌ఎస్ ​హయాంలో సైతం..

బీఆర్‌ఎస్ ప్రభుత్వ​హయాంలో కృష్ణ భాస్కర్​కేటీఆర్​ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లాకు కలెక్టర్‌గా వ్యవహరించారు. ఒక దశలో అక్కడ లాంగ్​స్టాండింగ్​అవుతుందని, నిబంధనలు అంగీకరించవనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు సిద్దిపేట కలెక్టర్‌గా నియమించి వెంటనే మళ్లీ సిరిసిల్లకు మార్చారు. ఆ తర్వాత కేటీఆర్​బాధ్యతలు నిర్వర్తించే పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్‌డీగా, ఆయన చూసే శాఖలకు షాడో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. డిప్యూటీ సీఎం మన్ననలు పొందిన కృష్ణ భాస్కర్ విద్యుత్, ఆర్థిక శాఖల్లో ఏ కీలక పోస్టు ఖాళీ అయినా ఆయనకే బాధ్యతలు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story