నిమ్మల కోటపై రెడ్ల పోరు..? హాట్ టాపిక్‌గా సెగ్మెంట్ పాలిటిక్స్

by Disha Web Desk 4 |
నిమ్మల కోటపై రెడ్ల పోరు..? హాట్ టాపిక్‌గా సెగ్మెంట్ పాలిటిక్స్
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిమ్మలను ఏలిన సామంత రాజు నిమ్మనాయుడు కోట నిర్మల్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కాకను రేపనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉన్న నిర్మల్ నియోజకవర్గంపై ప్రధాన రాజకీయ పక్షాలు నువ్వా నేనా అనే రీతిలో తలపడేందుకు కాళ్ళు దువ్వుతున్నాయి. నిర్మల్ నియోజకవర్గంపై మరోసారి జెండా ఎగరేసేందుకు అధికార భారత రాష్ట్ర సమితి గట్టి ప్రయత్నాలు చేస్తుండగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈసారి ఎలాగైనా నిర్మల్ స్థానాన్ని దక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే నిర్మల్ నియోజకవర్గం రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. కాగా మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అవుతుండడం ఎన్నికల పోరుకు మరింత ఆజ్యం పోస్తోంది.

నిమ్మల కోటపై రెడ్ల వార్

గతంలో మూడుపెన్నడూ లేని విధంగా నిర్మల్ నియోజకవర్గంలో రసవత్తర రాజకీయ పోరుకు తెర లేస్తున్నది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి బరిలో దించబోతోంది. నియోజకవర్గంలో అత్యంత బలప్రతిష్టమైన నేతగా ఆయనకు ముద్ర ఉంది. అన్ని వర్గాల్లో ఆయనకు బలం ఉంది. అన్నిటికి మించి ఎలక్షన్ మేనేజ్ మెంట్ విషయంలో ఇప్పటిదాకా ఆయనను మించిన నేత లేరన్నది రాజకీయ వర్గాల్లో పేరు.

కాగా భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో చాప కింద నీరులా బలంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భిన్న రకాల సర్వేలు చేయించుకున్న అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్లో ఆయన అత్యున్నత పదవులను అనుభవించడంతోపాటు ఇటీవల వరకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్గా పనిచేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్థాయిలో బలమైన సంబంధాలు ఉన్న నేతగా పేరు ఉన్నప్పటికీ ఆయన భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీలో చేరారు.

వీరిద్దరి నడుమ తీవ్రస్థాయిలో పోటీ ఉంటుందని నిన్నటిదాకా భావించారు. ఈ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉంటారని కాంగ్రెస్ నుంచి ఇతర నేతలు ఎవరు ఉండకపోవచ్చు అని ఉన్న గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అనూహ్యంగా భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నిర్మల్ జెడ్పీ సభ్యుల ఫోరం కన్వీనర్ సారంగాపూర్ జడ్పిటిసి సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి సోమవారం టీపీసీసీ రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరారు.

తాజా పరిణామాలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఒక దశలో అధికార పార్టీకి రాజీనామా చేసి మహేశ్వర్ రెడ్డి విజయం కోసం ఆయన బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన కాంగ్రెస్‌లో చేరడం రాజకీయ పరిణామాలను వేడెక్కిస్తున్నాయి. నిర్మల్ నియోజకవర్గంలో పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డికి కూడా బంధుగణం ఉంది. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో దిట్ట అన్న పేరు ఉంది.

పోటీ చేసిన ఏ ఎన్నికల్లోను ఆయన ఓడిపోయిన దాఖలాలు లేవు. అయితే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌లో చేరారు. సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు పెద్ద మండలం అయిన సారంగాపూర్‌తో పాటు తన బంధుమిత్రుల సహకారంతో బలమైన పోటీని ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దించుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకోవడంతోపాటు ఎన్నికల తీరు అత్యంత రసవత్తరంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed