కిర్గిజ్‌స్థాన్‌లోని భారత విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు: కేంద్రం ఆదేశాలు

by samatah |
కిర్గిజ్‌స్థాన్‌లోని భారత విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు: కేంద్రం ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కేక్‌లో అంతర్జాతీయ విద్యార్థులే లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత విద్యార్థులు బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు శనివారం కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ‘భారత విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. అయినప్పటికీ విద్యార్థులు ఇంటి లోపలే ఉండాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 ఇండియన్ ఎంబసీ ఫోన్ నంబ‌ర్ లో సంప్రదించాలి’ అని పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం..కిర్గిజ్‌స్థాన్‌లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎంబసీ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ..బిష్కెక్‌లో భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు పాకిస్థాన్ రాయబార కార్యాలయం సైతం తమ పౌరులకు ఓ అడ్వైజరీని జారీ చేసింది. కాగా, ఈ నెల 13న ఈజిప్ట్‌, కిర్గిజ్‌స్థాన్ విద్యార్థుల మ‌ధ్య జ‌రిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, పాకిస్థానీలతో సహా అంతర్జాతీయ విద్యార్థుల ప్రయివేటు నివాసాలపై దాడులు జరిగాయి. హాస్టళ్లలో భారత్, పాక్ బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థులు నివసిస్తున్నట్టు సమాచారం. ఈ దాడుల్లో పాక్ విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కిర్గిజ్‌స్థాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

Next Story

Most Viewed