గ్లోబల్ సమ్మిట్‌లో ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్.. ప్రారంభించిన సీతక్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్‌ను మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘనంగా ప్రారంభించారు.

గ్లోబల్ సమ్మిట్‌లో ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్.. ప్రారంభించిన సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Global Summit) భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మహిళా సాధికారతను ప్రతిబింబించే ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘనంగా ప్రారంభించారు. స్టాల్‌ను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ‘మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది.. సమాజం ఎదుగుతుంది.. రాష్ట్రం ఎదుగుతుంది. అందుకే మా ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్ర బిందువుగా చేసుకుని పని చేస్తోంది. ఈ స్టాల్‌లో కనిపిస్తున్న ప్రతీ విజయకథ మా తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా రూపొందించిన ఈ స్టాల్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆధ్వర్యంలో మహిళల చేతుల్లో నడుస్తున్న విభిన్న వ్యాపారాలు, సేవలు, ఆర్థిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు మహిళల ప్రయాణాన్ని ప్రతిబింబించే డాక్యుమెంటరీలను స్టాల్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలను పరిశీలించిన అనంతరం సీతక్క మాట్లాడుతూ.. ‘గ్రామీణ మహిళా సంఘాలు ఈ రోజు పెద్ద స్థాయిలో వ్యాపారాలు నడపడం.. కార్పొరేట్ స్థాయి సేవలు అందించడం.. ఇదే కొత్త తెలంగాణ శక్తి. మహిళకు వేదిక ఇస్తే ఆమె అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుందనే దానికి ఈ మోడల్స్ సాక్ష్యం’ అని అన్నారు.

‘వేల కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు, వడ్డీ రీయింబర్స్‌మెంట్, ప్రతి మహిళకు రూ. 10 లక్షల లోన్ బీమా, రూ. 2 లక్షల ప్రమాద బీమా-ఇవి అన్నీ తెలంగాణ మహిళకు ఆర్థికంగా రక్షణ ఇవ్వడానికి తీసుకున్న చారిత్రక నిర్ణయాలు. మా లక్ష్యం మహిళలను ఆత్మవిశ్వాసంతో నిలబడే యజమానిగా తీర్చిదిద్దడం’ అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం 20కు పైగా వ్యాపార రంగాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రవేశపెట్టి, మహిళలను ఆర్థికంగా నిలబెట్టే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని సీతక్క తెలిపారు. “మహిళ ఉన్నతిలోనే తెలంగాణ ప్రగతి ఉంది. ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్ మా రాష్ట్ర మహిళల ప్రతిభను, శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్న వేదిక. ఇది తెలంగాణ గర్వం మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తుకు దారి చూపే శక్తి” అని ఆమె పేర్కొన్నారు.

Next Story