గేటెడ్ కమ్యూనిటీ పేరుతో మోసాలు? కొనుగోలుదారులకు హైడ్రా హెచ్చరిక

by Ramesh Naini |

ప్లాట్‌, ఇంటి స్థ‌లం కొనేట‌ప్ప‌డు లోతుగా విచారించి.. అన్నీ స‌రిగా ఉంటేనే ముందుకు వెళ్లాల‌ని హైడ్రా సూచించింది.

గేటెడ్ కమ్యూనిటీ పేరుతో మోసాలు? కొనుగోలుదారులకు హైడ్రా హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్లాట్‌, ఇంటి స్థ‌లం కొనేట‌ప్ప‌డు లోతుగా విచారించి.. అన్నీ స‌రిగా ఉంటేనే ముందుకు వెళ్లాల‌ని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఏమైనా ఉన్నాయా? అనుమ‌తి పొందిన లే ఔటా.. కాదా? ఇంటి నంబ‌రు చూపించి ప్లాట్ల‌ను, బై నంబ‌ర్ల‌తో ప్లాట్ల‌ను అమ్ముతున్న‌ప్పుడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ప‌రిశీలించి కొనుక్కోవాల‌ని పేర్కొంది. గేటెడ్ క‌మ్యూనిటీ అంటూ ప్లాట్లు, విల్లాలు అమ్ముతున్న‌ప్పుడు ఆ అనుమ‌తుల‌ను ప‌రిశీలించాల‌ని కోరింది. గేటెడ్ క‌మ్యూనిటీ అయితే త‌న సొంత స్థ‌లంలోంచి చుట్టుప‌క్క‌ల కాల‌నీల‌కు క‌నీసం 40 అడుగుల దారి చూపించారా ? లేదా ? అనేది ప‌రిశీలించి కొనాలని తెలిపింది. ప్ర‌జావాణికి వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా ఈ హెచ్చ‌రిక‌లు చేసింది. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 48 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ వాటిని ప‌రిశీలించారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్‌, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

జీహెచ్ఎంసీలో..

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, విన్నపాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, అదనపు కమిషనర్‌లు, విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణికి 46, ఆరు జోన్ల కు సంబంధించి 24 మొత్తం 70 ఫిర్యాదులు, వినతులు పౌరుల నుంచి అందాయి. విభాగాల వారీగా వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌లు రవి కిరణ్, సత్యనారాయణ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహ రెడ్డి, సీసీపీ శ్రీనివాస్, సీఈ సహదేవ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story