టెండర్ తమాషా.. ఓటరు దినోత్సవ ఖర్చుపై నీలి నీడలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర సీఈఓ కార్యాలయంలో టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

టెండర్ తమాషా.. ఓటరు దినోత్సవ ఖర్చుపై నీలి నీడలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నచిన్న పనులకు సైతం టెండర్లు, కొటేషన్లు, ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అనుసరిస్తారు. కానీ రూ.కోట్ల నిధులు వెచ్చించి కొనుగోలు చేసే వాటిలో ఇవేమీ పాటించడంలేదు. కేంద్ర ఎన్నికల సంఘా నికి రాష్ట్రంలోని సీఈవో కార్యాలయంలో నిధుల విషయంలో నిబంధనలను లైట్‌ తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తూతూ మంత్రంగా టెండర్లను పూర్తి చేసి తమకు అనుకూలంగా ఉన్న వారికే టెండర్లు దక్కేలా చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ నేప థ్యంలో రాష్ట్రంలో ఓటుపై అవగాహన, ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు నమోదు ఇలా అనేక విషయాలపై అవగాహన కల్పించడానికి, ఓటింగ్‌పై ఆసక్తిని పెంచడానికి వివిధ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వీటన్నింటి కోసం సీఈవో కార్యాలయం రూ.19 కోట్లను వెచ్చించింది. విలువైన వస్తువులు, గిఫ్ట్‌లు, క్యాలెండర్, రకరకాల వాటిని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. జాతీయ ఓటరు దినోత్సవానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారా? అంతగా ఏం కొనుగోలు చేశారనే అనుమానాలు, సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

రూ.16 కోట్ల బిల్లులు చెల్లింపులు

రూ.19 కోట్లకు కొనుగోళ్లు చేయగా ఇప్పటికే రూ.16 కోట్ల బిల్లులు చెల్లింపులు జరిగాయని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసేటప్పుడు ప్రొక్యూర్‌మెంట్ కమిటీలు, టెండర్లకు విస్త్రత ప్రచారం కల్పించడం, కాంట్రాక్టర్లు, సంస్థల మధ్య పోటీ వాతావరణం కల్పించడం ద్వారా తక్కువకు టెండర్లు, కొటేషన్‌లు దాఖలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ తూతూ మంత్రంగా టెండర్ నోటీసులు ఇవ్వడం, మిగిలిన కాంట్రాక్టర్లకు తెలియకుండా తమకు అనుకూలమైన అప్పటికే ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లకు, సరఫరాదారులకు తెలిసేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్నచిన్న వస్తువులకు సైతం పెద్ద మొత్తంలో వెచ్చించి.. మరికొన్ని అవసరం లేని చిన్నచిన్న వాటికి రూ.లక్షల్లో ఖర్చు చేశారని చెబుతున్నారు. చిన్న క్యాలెండర్‌లు, మహిళలు ధరించే అభరణాలనూ కొనుగోలు చేశారు. అయితే వీటిని ఎంత మందికి అందించారనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్వహించే పనులు అత్యవసరమైనవనే ఉద్దేశంతో వీటిని విడుదల చేస్తుంటారు. కానీ ఎన్నికల సంఘం అధికారులు నిధులను దుర్వినియోగం చేయడం, తమకు అనుకూలంగా ఉన్న వారికి లబ్ధి చేకూర్చి వారి ద్వారా వీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సీ సెక్షన్ ద్వారానే కొనుగోలు

ఎన్నికల సంఘంలో ఏ, బీ, సీ, డీ సెక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా కార్యకలాపాలన్నీ జరుగుతుంటాయి. అయితే కార్యాలయంలో ఏ సెక్షన్‌కు, ఏ విభాగానికి ఏ అవసరం ఉన్నా.. కేవలం సీ సెక్షన్ ద్వారానే పనులు చేయిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆ ర్)కు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం కానున్నా యి. ఇప్పటికే దీనికి సంబంధించిన మెటీరియల్ కొనుగోలు చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. వీటి టెండర్ల లో ఇదే తరహాలో వ్యవహరించినట్లుగా కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దాదాపుగా రూ.20 కోట్లకు సంబంధించిన టెండర్లలో కొందరికి అనుకూలంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. సీ సెక్షన్ కు వంత పాడే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, అనుమానాలు, సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్లలో ఇచ్చే టెండర్ నోటిఫికేషన్ల నుంచి సరఫరా వరకు విచారణ జరిపితే అనేక రకాల నిబంధనలు ఉల్లంఘనలు, అక్రమాలు, అవినీతి, బయటపడతాయని చెబుతున్నారు.

Next Story