- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి గ్లోబల్ ప్రాజెక్టులకు ఎస్బీఐ గ్రీన్ సిగ్నల్.. ముంబై హెడ్ ఆఫీస్‌లో అధికారులతో సీఎండీ భేటీ
సింగరేణి గ్లోబల్ పేరుతో దేశ విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన సంసిద్ధత తెలియజేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సింగరేణి (Singareni) గ్లోబల్ పేరుతో దేశ విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన సంసిద్ధత తెలియజేసింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ముంబాయిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీ సత్యేంద్ర కుమార్ సింగ్, సీజీఎం శైలేశ్ ఉన్నితన్‌లతో ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా (CMD Balaram) సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ త్వరలోనే దేశ విదేశాల్లో కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించబోతోందని తెలిపారు. ఇప్పటికే సింగరేణి సంస్థకు కర్ణాటకలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ లభించిందన్నారు. దేశ విదేశాల్లో కీలక ఖనిజ అన్వేషణ ఉత్పత్తి కోసం ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా అధ్యయనం జరుపుతోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక ఖనిజ రంగానికి సంబంధించి అందిస్తున్న రాయితీలను వినియోగించుకుంటూ దేశంలో కూడా పెద్ద ఎత్తున కీలక ఖనిజ ఉత్పత్తికి పూనుకోవాలని నిర్ణయించిందన్నారు. అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, 5 వేల మెగావాట్ల సోలార్, థర్మల్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్, మిథనాల్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోందని సీఎండీ వివరించారు. సింగరేణి సంస్థ త్వరలో చేపట్టనున్న భారీ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. దీనిపై ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి సానుకూలంగా స్పందించారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఇప్పటికే సింగరేణికి ప్రధాన ఆర్థిక లావాదేవీల (లీడ్) బ్యాంకుగాను సేవలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ సింగరేణి అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సంస్థగా తన సత్తా చాటాలని ఆకాంక్షించారు. దశాబ్దాల కాలంగా ఎస్బీఐ సంస్థ సింగరేణితో మంచి అనుబంధం కలిగి ఉందన్నారు.
ఎస్బీఐతో దశాబ్దాల బంధం..
సింగరేణి సంస్థ దశాబ్దాల కాలంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ద్వారానే పెద్ద ఎత్తున తన ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోంది. సింగరేణిలో ఉన్న 75% కార్మికులకు ఎస్బీఐలోనే ఖాతాలు ఉన్నాయి. అలాగే సింగరేణి ఉద్యోగుల కోసం ఎస్బీఐ సంస్థ ద్వారా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తోంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టులలోనూ భాగస్వాములు కావాల్సిందిగా, సహకారం అందించాల్సిందిగా కోరుతూ సీఎండీ ఎన్.బలరామ్ ఎస్బీఐ ఉన్నతాధికారులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు.






