రేపే పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్.. ప్రలోభాలు షురూ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో స్థానిక పోరు వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి.

రేపే పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్.. ప్రలోభాలు షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్థానిక పోరు వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు దీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు స్పెషల్ గిప్టులు పంపుతున్నారు. కొందరు చికిన్, మటన్ పంపుతుంటే, మరికొందరు లిక్కర్‌ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి రెండు వేల వరకు పంచబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

పోటాపోటీగా ప్రలోభాలు

తెలంగాణలోని 4, 236 గ్రామాల్లో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పోలింగ్ కు ముందు రోజు నుంచి చాలా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో చికెన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చినట్లు టాక్ ఉంది. అభ్యర్థుల మనుషులు ఉదయాన్నే ఇంటింటికి తిరిగి చికెన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే మగవారికి క్వార్టర్ బాటిల్‌ను కూడా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ. వెయ్యి పంపిణీ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో రూ. 2 వేల వరకు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో చికెన్‌తో పాటు, చికెన్ తినని వారికి మటన్ సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు టాక్ ఉంది. అయితే వలస ఓటర్లను పోలింగ్‌ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వెహికిల్స్‌ను ఆరెంజ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల ప్రయాణ ఖర్చులను ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం అయితుంది. ఏదీ ఏమైనా ఎలక్షన్ వేళ గ్రామాల్లో హడావుడి మాములుగా లేదు.

Next Story