రంగంలోకి దిగిన సజ్జనార్ ‘సిట్’.. కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-20 07:27:53  IST  )

అక్రమ ట్యాపింగ్‌ కేసులో దాదాపు 21 నెలల తర్వాత తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

రంగంలోకి దిగిన సజ్జనార్ ‘సిట్’.. కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ ట్యాపింగ్‌ కేసులో దాదాపు 21 నెలల తర్వాత తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, తొమ్మిది మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ఈ సిట్‌కు హైదరాబాద్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌ (VS Sajjanar) పర్యవేక్షణలో పనిచేయనుంది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణకు ఈ నెల 26 వరకు సుప్రీంకోర్టు గడువు ఇవ్వడంతో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొత్త సిట్ సభ్యులతో మొదట సీపీ సజ్జనార్ సమావేశమయ్యారు. మొదట ఎక్కడి నుంచి విచారణకు ప్రారంభించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే సిట్ సభ్యుల్లో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ (Vijay Kumar) కూడా ఉండటంతో ఆయన వద్ద కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఉంది. ఆయన హయాంలోనే కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అనంతరం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి సీసీఎస్ (CCS) ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చారు. విచారణలో భాగంగా సిట్ టీమ్ ప్రభాకర్‌ రావును ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఎవరి ఆదేశాల మేరకు ఆర్డర్లు జారీ చేశారనే విషయాలపై కూడా లాగుతున్నట్లుగా సమాచారం. కేసు నమోదైన తర్వాత కీలక ఆధారాలైన హార్డ్ డిస్కులు (Hard Disks), ఎలక్ట్రానిక్ డేటా, ఫోన్లు (Phones), ల్యాప్‌టాప్‌, ఐక్లౌడ్ పాస్‌వర్డ్స్ ఏం చేశారు, ఎందుకు ధ్వంసం చేశారని సిట్ అధికారులు ప్రభాకర్‌ రావును ప్రశ్నిస్తున్నారు.

Next Story