త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం.. శాసనమండలిలో మంత్రి పొంగులేటి ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-24 06:54:57  IST  )

తెలంగాణ శాసన మండలిలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం.. శాసనమండలిలో మంత్రి పొంగులేటి ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించినప్పటికీ, 2020 ఆర్.ఓ.ఆర్ (ROR) చట్టంలో వాటి పరిష్కార మార్గాన్ని చూపలేదని విమర్శించారు.

జీవో 76తో ఊరట..

సాదాబైనామా సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో.. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని, ఇకపై కేవలం కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేరకు జీవో 76 (G.O. 76) విడుదల చేసినట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9 లక్షలకు పైగా దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనుంది.

ఆధార్ మాదిరిగానే ‘భూధార్’..

నక్షా (Map) లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీ-సర్వే నిర్వహించామని మంత్రి తెలిపారు. ఇందులో ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే ‘భూధార్’ కేటాయించినట్లు వెల్లడించారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో, ఒక్కో జిల్లాలో 70 గ్రామాల చొప్పున భూ సర్వే నిర్వహించి, దశలవారీగా భూధార్ నెంబర్లు జారీ చేస్తామని, తద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.

అవినీతిపై ఉక్కుపాదం..

ధరణి పోర్టల్‌లోని లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది మీ-సేవ నిర్వాహకులతో కలిసి రూ. 3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తున్నామని మంత్రి తెలిపారు. తప్పు చేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని, ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో ‘భూ భారతి’ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

Next Story