- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో కర్ణన్ మార్క్.. పాలనలో వినూత్న మార్పులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై తనదైన మార్క్ పాలనకు కర్ణన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్రసాదరావు కమిటీ సిఫార్సులను అమలు చేయడంతో పాటు అడిషనల్ కమిషనర్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించారు.

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై తనదైన మార్క్ పాలనకు కర్ణన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్రసాదరావు కమిటీ సిఫార్సులను అమలు చేయడంతో పాటు అడిషనల్ కమిషనర్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే 12మంది ఉన్న అడిషనల్ కమిషనర్ల సంఖ్యను తొమ్మిదింటికి తగ్గించారు. అయితే త్వరలోనే జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను సైతం బదిలీ చేయడంతో పాటు భారీగా మార్పులు చేయడానికి జాబితా కూడా సిద్ధం చేసినట్లు అధికారవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఈ మార్పుల్లో సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఒక్కో విభాగానికి జేసీ
జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్లను కుదించడంతో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు, ఆపైగా విభాగాలను కేటాయించే అవకాశం ఉంది. వీటిని సమన్వయం చేయడానికి ఒక్కో విభాగానికి ఒక్కో జాయింట్ కమిషనర్ ను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే శానిటేషన్ విభాగానికి ఇద్దరు, హెల్త్ విభాగానికి కలిసి ముగ్గురు జేసీలను నియమించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇతర విభాగాలకు సైతం జేసీలను నియమించనున్నారు. ఈ జేసీ పోస్టులను సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లలోని సీనియర్లకు కేటాయించాలని నిర్ణయించారు. సీడీఎంఏ నుంచి ప్రమోషన్ పొందిన 11మంది సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలిసింది.
డీసీల బదిలీలు
జీహెచ్ఎంసీలోని 30సర్కిళ్లకు 30మంది డిప్యూటీ కమిషనర్లు అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నవారిలో చాలా మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు(ఏఎంసీ)లనే ఇంచార్జి డిప్యూటీ కమిషనర్లుగా నియమించారు. అయితే సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లను జాయింట్ కమిషనర్లుగా నియమించడంతో పాటు మిగిలినవారిని ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమైన సర్కిళ్లను డిప్యూటీ కమిషనర్లుగా నియమించనున్నారు. మిగిలినవాటికి ఏఎంసీలను ఇంచార్జి డీసీలుగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆగస్టులో పలువురికి స్పెషల్ గ్రేడ్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ సెలెక్షన్, గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్లుగా ప్రమోషన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అర్హత కలిగినవారు లేకపోవడంతోనే స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ల ప్రమోషన్స్ ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్న డీసీలను సైతం మార్చడానికి కసరత్తు చేస్తున్నారు.
ప్రసాదరావు కమిటీ సిఫార్సుల అమలేది?
జీహెచ్ఎంసీ ప్రసాదరావు కమిటీ సిఫార్సుల ప్రకారం అడిషనల్ కమిషనర్ల సంఖ్యను ఆరుకు కుదించడానికి కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కానీ ఆరుగురికి రీ పోస్టింగ్ ఇచ్చిన కమిషనర్ మరో ముగ్గురు అడిషనల్ కమిషనర్లను ఎందుకు మార్చలేదని అధికారులు చర్చించుకుంటున్నారు. జూనియర్ ను అడిషనల్ కమిషనర్ గా నియమించి.. సీనియర్లకు జాయింట్ కమిషనర్లుగా పోస్టింగ్ ఇవ్వడం ఏమిటని విమర్శలొస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రసాదరావు కమిటీ సిఫార్సుల ప్రకారం జీహెచ్ఎంసీలో కమిషనర్ తో పాటు నలుగురు ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం ఐదుగురు ఐఏఎస్, ఒకరు ఐఎఫ్ఎస్ అధికారి ఉన్నారు. వీరిని కూడా తగ్గించనున్నారా? కొనసాగిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. ఈ విషయంలో కమిషనర్ కర్ణన్ తీరుపై చర్చ జరుగుతున్నది.
చీఫ్ ఎంటమాలజిస్ట్ గా సంధ్య?
జీహెచ్ఎంసీలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ ను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం. గతంలో కూకట్ పల్లి సీనియర్ ఎంటమాలజిస్ట్ గా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలున్న అధికారిని నియమించనున్నట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో సీనియర్ అధికారికి చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్టు ఇవ్వకుండా ఆరోపణలున్న వ్యక్తిని తీసుకురావడమేమిటని? పలువురు ప్రశ్నిస్తున్నారు.






