- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకు ఏ రూల్స్ పట్టవు..! ‘భూభారతి’ వచ్చినా మారని రెవెన్యూ లీలలు
తెలంగాణ రెవెన్యూ శాఖలో తహశీల్దార్ల సొంత రూల్స్! ఫేక్ సేల్ డీడ్స్‌తో మ్యుటేషన్లు, నకిలీ ఆధార్‌తో ఇతరుల పేరిట పట్టాలు చేస్తున్న పైరవీకారుల దందాపై ప్రత్యేక కథనం.

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి చట్టం అమల్లో ఉండగా కలెక్టర్ల రాజ్యం నడిచేది. భూభారతి చట్టం వచ్చాక తహశీల్దార్ల సొంత రూల్స్ పనిచేస్తున్నాయన్న అపవాదు ఉంది. సామాన్యుల దరఖాస్తు వచ్చిందంటే చాలు ముప్పుతిప్పలు పెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఫేక్ సేల్ డీడ్స్ తోనూ మ్యుటేషన్ చేయొచ్చని కొందరు తహశీల్దార్లు నిరూపిస్తున్నారు. అలాగే హక్కుదారుడు ఒకరైతే మరొకరి పేరిట పట్టా పాస్ బుక్ జారీ చేయొచ్చని రుజువు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పును సవరించాలంటే నోటీసు బోర్డుపై 15 రోజులు పెట్టాలని పేచీ పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పదే పదే ఆదేశాలు జారీచేస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన పురోగతి ఉండటం లేదు.
తెర వెనక పైరవీకారులు
రూ.కోట్ల విలువైన భూముల విషయంలో రూల్స్ విరుద్ధంగా పనులు నడుస్తున్నాయి. ఫేక్ సేల్ డీడ్ పెట్టి మ్యుటేషన్ చేయడం అంటే ఎంత సాహసం చేయాలి? తెర వెనుక పెద్దల సాయం లేకుండా మండల స్థాయిలోనే ఈ పని జరిగిందా? అన్న సందేహం కలుగుతుంది. ఒక జిల్లాలో భూ సమస్యకు మరో జిల్లా పైరవీకారుడు చక్రం తిప్పుతున్నాడు. నిబంధనలకు అనుగుణంగా పనులుచేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అసలైన హక్కుదారులకు నష్టం కలిగిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. శంషాబాద్, శామీర్ పేట, ఘట్ కేసర్ ల్లో చోటుచేసుకున్న పరిణామాలు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నట్టు చర్చ నడుస్తున్నది. అయితే రిటైర్ట్ మెంట్ కు దగ్గరలో ఉన్న అధికారులు మాత్రం అందినకాడికి సంపాదించుకోవాలన్న తాపత్రయంతో తప్పులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఫేక్ సేల్‌డీడ్‌తో మ్యుటేషన్
ఫ్యూచర్ సిటీకి సమీపంలోని కందుకూరు మండలంలో ఓ వ్యక్తికి 12.11 ఎకరాల భూమి ఉంది. ఆయన సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఆయనకు పిల్లలు లేకపోతే ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. ఈ భూమిని కొందరు కబ్జాచేశారు. ధరణి పోర్టల్ సమయంలో రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఆ సమయంలో పట్టాదారులకు 1బీ జారీచేశారు. ఆ తర్వాత ఆధార్ తో సహా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఈ భూమికి వారసులు రాలేదు. ఆధార్ పెండింగ్ అని చూపింది. ఓ ఫేక్ సేల్ డీడ్ తో తాము కొనుగోలు చేశామని కొందరు మ్యుటేషన్ చేయించుకున్నారు. తహశీల్దార్, ఆర్డీవోల సహకారంతో ఆ ప్రక్రియ పూర్తయింది. అసలు వారసులు ఈ భూమి తమదని వచ్చారు. వారి భూమి ఇతరుల పేర నమోదై ఉంది. ఇదేమిటని చూస్తే వారి తండ్రి విక్రయించినట్టు సేల్ డీడ్ చూపించారు. ఇది ఆరాతీస్తే అసలు నంబర్ కలిగిన సేల్ డీడ్ కాదని తేలింది. ఫేక్ సేల్ డీడ్ ఆధారంగా మ్యుటేషన్ చేశారని గుర్తించారు. రద్దు చేయాల్సిన తహశీల్దార్, ఆర్డీవోలు తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకరి భూమి మరొకరి పట్టా
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో నకిలీ ఆధార్ తో పట్టాచేశారు. ఎప్పుడో చనిపోయిన పట్టాదారుడికి కొడుకులు లేరు. ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఈ భూమిని మరోవ్యక్తి పేర పట్టాచేశారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకాల్లో వేర్వేరుగా పేర్లు ఉండటం గమనార్హం. డీఎస్ పెండింగ్ అని ఇన్నాళ్లూ చూపింది. ఇప్పుడేమో ఆ పట్టాదారు పేరు కాకుండా మరొకరికి చేయడం విశేషం. అధికారులు ఇది గుర్తించినా పట్టాదారు పాస్ బుక్ జారీ అయింది. అసలు పట్టాదారు, నకిలీ పట్టాదారు ఇంటిపేరు ఒక్కటే కావడం విశేషం. అయితే ఏనాడో చనిపోయిన సదరు వ్యక్తి పేరిట ఉన్న భూమిని కొట్టేయడానికి జడ్చర్ల మండలానికి చెందిన ఓ పైరవీకారు చక్రం తిప్పినట్టు తెలిసింది.
ఎన్నో వింత రూల్స్
ఓ రైతు తన పాస్ బుక్ లో సర్వే నంబర్ మిస్సైయిందని, సరిచేయాలని టీఎం 33 కింద దరఖాస్తు చేశాడు. అధికారులు కొన్నినెలల తర్వాత సరేనన్నారు. పాజిటివ్ రిపోర్ట్ రాశారు. రికమండ్ చేసి ఆర్డీవోకు పంపకుండా పెండింగులో ఉంచారు. ఇదేమిటని అడిగితే ఇది మిస్సింగ్ సర్వే నంబర్.. ప్రొసీజర్ ప్రకారం నోటీసు బోర్డులో అంటించాలి. ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోతే పైకి పంపుతామని తహశీల్దార్ చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. అలా 15 రోజులు ఎందుకు పెట్టాలో ఏ అధికారిని అడిగినా చెప్పడం లేదు. నోటీసు బోర్డుపై అంటించాలన్న విషయం తమకు తెలియదని పలువురు తహశీల్దార్లు తెలిపారు. ఇలాంటి వింతలు, విశేషాలు రెవెన్యూ కార్యాలయాల్లో ఎన్నో ఉన్నాయి.
ఫిజికల్ కాపీ లేదని రిజెక్ట్
హైదరాబాద్ శివారు జిల్లాలో ఓ ముగ్గురు అన్నదమ్ములకు భూమి ఉంది. అది వారసత్వంగా వచ్చిందే. అది తరతరాలుగా పట్టా భూమి. దాన్ని అసైన్డ్ ల్యాండ్ గా పేర్కొంటూ పీవోబీలో నమోదు చేశారు. మూడు సార్లు అప్లై చేసినా రిజెక్ట్ చేశారు. నాలుగో సారి జీపీవో, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, డీటీ, తహశీల్దార్, ఆర్డీవో ఆఫీసులో సెక్షన్ ఎంప్లాయీస్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ సెక్షన్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్, అడిషనల్ కలెక్టర్ వరకు ఫైల్ చూసి రికమండ్ చేశారు. కానీ కలెక్టర్ సెక్షన్ లోకి వెళ్లగానే ఫిజికల్ ఫైల్ లేదని రిజెక్ట్ చేశారు. వెంటనే మళ్లీ తహశీల్దార్ లాగిన్ కు పంపించారు. ఒక్కఫోన్ చేసి దీనికి సంబంధించిన ఫైల్ పంపించాలని చెప్పినా సరిపోతుంది. కానీ మళ్లీ మొదటి నుంచి వెళ్లాలి. ఇంతకీ అంతా ఆన్ లైన్ చేస్తున్నప్పుడు ఫిజికల్ ఫైల్ ఎందుకు అన్నది కలెక్టర్ సెక్షన్ అధికారికే తెలియాలి. ఎవరికి వారే కొత్త రూల్స్ సృష్టించుకోవడం విశేషం. అన్నదమ్ముల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వారు ఉన్నారు. అంతటి విద్యావంతుల సమస్యనే పరిష్కరించడం లేదంటే రెవెన్యూ అధికారుల రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.






