ప్రభుత్వంలో విలీనం చేసి, ట్రేడ్ యూనియన్‌గా పునరుద్ధరణ చేయాలి : ఆర్టీసీ జాక్​ కీలక డిమాండ్లు

by Ramesh Naini |

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని టీజీఎస్​ఆర్టీసి జాక్​ డిమాండ్​ చేసింది.

ప్రభుత్వంలో విలీనం చేసి, ట్రేడ్ యూనియన్‌గా పునరుద్ధరణ చేయాలి : ఆర్టీసీ జాక్​ కీలక డిమాండ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మాటను రేవంత్​ రెడ్డి ప్రభుత్వం నిలుపుకోవాలని టీజీఎస్​ఆర్టీసి జాక్​ డిమాండ్​ చేసింది. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అధికారం చేపట్టి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ప్రభుత్వంలో విలీనం యూనియన్ల పునరుద్ధరణ లాంటి ఎన్నో అంశాలు ఏ ఒక్కటి పరిష్కారానికి నోచుకోలేదని జాక్ ​నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికలు జరిపి చట్టవ్యతిరేక డ్యూటీలను రద్దు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన జాబ్ సెక్యూరిటీ నిబంధనలు రద్దు చేసి, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2017 పీఆర్సీకి సంబంధించి అరియర్స్ అందరికీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 2021 పీఆర్‌సీ ప్రకటించి ప్రభుత్వంలో విలీనం చేయాలని, చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు మరియు మెడికల్ ఫిట్​నెస్ అయిన పిల్లలకు వెంటనే శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పీహెచ్‌బీ బస్సులను ఆర్టీసీలో విలీనం చేసి అందులో పనిచేస్తున్న డ్రైవర్స్ ఆర్టీసీలో రెగ్యులర్ గా నియమించాలని తెలిపారు.

మహాలక్ష్మి పథకం ఉనికికే ప్రమాదం

ఎలక్ట్రిక్ బస్సులను ఇదే విధంగా కొనిసాగిస్తే భవిష్యత్ లో ఆర్టీసీ బస్సులు ఉండవని, చాలామంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం ఉనికికే ప్రమాదం అవుతుందని జాక్ నేతలు హెచ్చరించారు. ‘ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకొని ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ప్రభుత్వం ఆమోదించిన పోస్టులను వెంటనే జిల్లాల వారికి కమ్యూనికేట్ చేసి ఖాళీలలను భర్తీ చేయాలి. గ్యారేజ్, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వన్​టైమ్​ సెటిల్మెంట్ క్రింద అందరికీ రెగ్యులర్ చేయాలి. గ్యారేజ్‌లో పని భారాన్ని తగ్గించి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. బ్రీత్ అనలైజర్ కేసులలో సస్పెండ్ రిమూవల్ చేసిన ఉద్యోగులందరినీ వెంటనే డ్యూటీ లోకి తీసుకోవాలి. ఇక నుంచి చట్టప్రకారం బ్రీత్ అనలైజర్ కేసులను ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, రవాణా శాఖ నేరుగా చేయాలి’ అని డిమాండ్​ చేశారు.

Next Story