రాఖీ పండుగ ఎఫెక్ట్.. మహిళలకు బంపర్ ఆఫర్

by Disha Web Desk 2 |
రాఖీ పండుగ ఎఫెక్ట్.. మహిళలకు బంపర్ ఆఫర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రాఖీ పౌర్ణమిన లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన బహుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 రీజయిన్లు ఉండగా, ఒక్కో రీజయిన్‌కు ముగ్గురు మహిళలకు గిప్టులు ఇవ్వనున్నారు. 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించనున్నారు.

ఈనెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సులలో వేయాలి. ఆ డ్రాప్ బాక్సులను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.

“మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్సులలో వాటిని వేయాలి.

ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్సులను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనార్ లు తెలిపారు. ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

Read More: సెప్టెంబర్‌లో చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఇవే.. లాస్ట్ డేట్ 30!

Next Story

Most Viewed