- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం
రహదారుల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో 98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం
2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రోడ్లు నిర్మాణమే లక్ష్యం
నవంబర్ లో హైటెక్స్ లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్
రహదారుల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రూ. 98 వేల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని... అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వేగంగా పనులు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 చివరి నాటికి రోడ్ల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టినట్టు మంత్రులు తెలిపారు. దేశంతో పాటు, ప్రపంచం నలుమూలల నుంచి రోడ్డు కాంట్రాక్టర్లు, బిల్డర్లు హాజరయ్యే ప్రతిష్టాత్మక ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్సీ) సమావేశం 2026 నవంబర్ లో హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎంపీగా, కేంద్రమంత్రి గడ్కరీ తో తనకున్న పరిచయం మూలంగా హైదరాబాదులో ఐఆర్సీ నిర్వహణకు ఒప్పించినట్లు వివరించారు. ఈ సమావేశం నిర్మాణాలకు బిజెపి పాలనలోని రాష్ట్రాలు పోటీపడినప్పటికీ కేంద్ర మంత్రి గడ్కరీ తన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతించినట్లు తెలిపారు. ఐఆర్సీ ప్రెసిడెంట్ గా రాష్ట్రానికి చెందిన మోహన్ నాయక్ ఎన్నికైన విషయాన్ని సైతం మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఐఆర్సీ నిర్వహణకు అవసరమైన నిధులను బుధవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసినందుకు ఆయనకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు...
ఐఆర్సీ అనంతరం రాష్ట్రానికి రూ.20 వేల కోట్లకు పైగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.148 కోట్లతో నిర్మించనున్న అప్రోచ్ రహదారులతో 300 గ్రామాల్లో నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనుందని తెలిపారు. గత ప్రభుత్వం సమావేశాలు పెట్టి వదిలివేయడం తప్ప అప్రోచ్ రోడ్ల పూర్తికి నిధులు మంజూరు చేయలేదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో 6వేల కి.మీ రహదారులను హ్యామ్ మోడల్ లో చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ పనులకు సంబంధించిన ప్రైస్ బిడ్ పనులు పూర్తి అయ్యాయని.. మే మొదటి వారంలో రాష్ట్రంలో హ్యామ్ మోడల్ లో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రూ. 20 వేల కోట్లతో చేపట్టే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పనులను 8 లైన్లతో విస్తరిస్తున్నామని తెలిపారు. ఆరు ప్రధాన లైన్లు, రెండు సర్వీస్ లైన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.500 కోట్లతో బ్లాక్ స్పాట్స్, చౌటుప్పల్, చిట్యాల వంటి గ్రామాల మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని మంత్రి వివరించారు.
రూ. 20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు...
ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి- బందరు పోర్టు వరకు రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి అలైన్మెంట్ ఖరారు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు మంత్రి అధికారులకు వివరించారు. ఈ రోడ్డు అలైన్మెంట్ కు అనుగుణంగా బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్మెంట్ సైతం ఖరారు చేసి కేంద్రానికి పంపినట్టు మంత్రి వెంకటరెడ్డి వివరించారు. మన్ననూరు- శ్రీశైలం 52 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ రహదారి నిర్మాణానికి రూ.8వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్ )నిర్మాణానికి రూ.36 వేల కోట్లు మంజూరు అయ్యాయని ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ ప్రాజెక్టు అని మంత్రి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 8న ఆర్ఆర్ఆర్ రోడ్డు ఉత్తరభాగం భూ సేకరణకు రాష్ట్ర వాటాగా రూ.628 కోట్లు ఎన్.హెచ్.ఎ.ఐకు జమ చేసినట్లు తెలిపారు. ఎల్బీనగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను రూ.941 కోట్లతో చేపడుతున్నామని... ఇందులో కేంద్రం వాటా రూ.741 కోట్లు కాగా రాష్ట్రం రూ. 200 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలో 2025 సంవత్సరంలో 6500 మంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని... ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం, అరైవ్-అలైవ్ వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.






