ప్రాణాలతో చెలగాటం: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి పనుల్లో గాలికొదిలేసిన భద్రత!

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ - చంచల్‌గూడ ప్రాంతాల్లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు వాహనదారులకు, స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రాణాలతో చెలగాటం: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి పనుల్లో గాలికొదిలేసిన భద్రత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ - చంచల్‌గూడ ప్రాంతాల్లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు వాహనదారులకు, స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతోంది.

మృత్యుపాశంలా భారీ గిర్డర్లు..

నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సంతోష్ నగర్ వరకు చేపట్టిన ఈ 3.80 కి.మీ ఫోర్-లేన్ స్టీల్ ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా ప్రస్తుతం భారీ ఐరన్ గిర్డర్లను అమర్చుతున్నారు. అయితే, ఈ భారీ ఐరన్ గిర్డర్లను కార్మికులు ఎలాంటి భద్రతా ప్రామాణాలు పాటించకుండా పనులు చేయడం, గిర్డర్లను పైకి లేపుతున్న సమయంలో, కింద వాహనాల రాకపోకలను నియంత్రించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం తేడా జరిగినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, నిర్మాణ సంస్థల తీరు 'మృత్యుపాశం'లా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.

వైరల్ వీడియోతో వెలుగులోకి..

నిర్మాణ ప్రాంతంలో కార్మికులు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు వంటి కనీస రక్షణ కవచాలు లేకుండా ప్రమాదకరంగా పనిచేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘అధికారులు నిద్రపోతున్నారా? ఏదైనా ప్రాణనష్టం జరిగిన తర్వాతే స్పందిస్తారా?’ అంటూ స్థానికులు, నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.

Next Story