డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులు: 2026-27 నుంచి 29 కొత్త కోర్సులు!

by Kema Shiva Kumar |

తెలంగాణ ఉన్నత విద్యామండలి 2026-27 విద్యాసంవత్సరం నుండి డిగ్రీ, పీజీలలో 29 కొత్త ఉపాధి ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతోంది.తెలంగాణ ఉన్నత విద్యామండలి 2026-27 విద్యాసంవత్సరం నుండి డిగ్రీ, పీజీలలో 29 కొత్త ఉపాధి ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతోంది.

డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులు: 2026-27 నుంచి 29 కొత్త కోర్సులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: చదువు అనంతరం విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2026-27 విద్యాసంవత్సరం నుంచే డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. డిగ్రీ విద్యార్థుల కోసం 19 కోర్సులు, పీజీ స్టూడెంట్స్ కోసం మరో 10 కోర్సులను ఆచరణలోకి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, పరిశ్రమల అవసరాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. డిగ్రీలో కొత్తకోర్సులు, క్రెడిట్లలో మార్పులు వంటి అంశాలపై సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ అన్ని యూనివర్శిటీల వీసీలతో చర్చించారు.

కొత్త కోర్సులు ఇవే

డిగ్రీలో కొత్త కోర్సుల్లో బీఏలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, బీబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, ఎయిర్ పోర్ట్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్, బీబీఏలో మారిటైం టెక్నాలజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్, బీకాం పైనాన్స్ టెక్నాలజీ, ఇంటర్ నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఈ కామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, బీఎస్సీలో డేటా సైన్స్ అండ్ ఏఐ, మెడికల్ మైక్రోబయాలజీ, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. వీటికి సంబంధించి విద్యార్థులకు డిజిటల్ విధానంలో రీడింగ్ మెటీరియల్ అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాకుండా ఆన్ లైన్ ట్యూటర్ల చేత క్లాసులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

నిపుణులతో ‘మండలి’ సమాలోచనలు

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అకడమిక్ నిపుణులు, అనుభవజ్ఞులైన రిటైర్డ్ డిఫెన్స్ అధికారులతో ఉన్నత విద్యామండలి అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. క్లాసులు బోధించేందుకు ఆసక్తి చూపే డిఫెన్స్ అధికారులను ఇప్పటికే సంప్రదిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని సైతం తీసుకోనున్నారు. అలాగే పీజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. నీతిఆయోగ్‌, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌, యునెస్కో, నాస్కామ్‌, ఓఈసీడీ వంటి ప్రఖ్యాత సంస్థల అధ్యయనాలు, చేసిన కీలక సూచనల ఆధారంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులను రూపొందిస్తున్నారు.

రైజింగ్ విజన్ అమలు

ప్రపంచం శరవేగంగా మారుతున్నది. సముద్రగర్భం నుంచి ఆకాశం వరకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలంటే మన విద్యావ్యవస్థ అందుకు అనుగుణంగా ఉండాలన్నదే మా ఉద్దేశం. ఈ క్రమంలో మారుతున్న ప్రాధాన్యతలు, అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నాం. ఐఐటీ మద్రాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు అందించి, గొప్ప అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ నినాదంతో ముందుకెళ్తున్నాం.

- ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్

Next Story