- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక ఒకే గొడుగు కిందకు ఆ మూడు శాఖలు
భూ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకొస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ శాఖలను భూ భారతి పోర్టల్ తో అనుసంధానం చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో ఆధునీకరించిన ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తమన్నారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ పరిపాలనకు కేంద్రమైన సీసీఎల్ఏ కార్యాలయం నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కార్పొరేట్‌కు ధీటుగా ఆఫీసును ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, అప్పటి వరకు మార్పు కనిపించాలన్నారు. వరుసగా విభాగాల వారీగా సమీక్షిస్తానన్నారు. అందుకు సంబంధించి అధికారుల పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలన్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ జరిపిందని, ఇప్పటికీ కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తుల పేరు మీదే ఉన్నాయని, ఇవన్నీ కూడా రికార్డులలో మార్చాలన్నారు. అలాగే అసైన్డ్, భూధాన్ భూములపై సమీక్షతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి, కోర్టు కేసులన్నింటిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.
పూర్తి సమాచారం ఉండాలి
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలు ఒకే మోడల్‌గా ఉండాలని, ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఒక్క క్లిక్‌తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా ఉండాలన్నారు. అదే విధంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్, గ్రామాల నక్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి సమాచారం లభించేలా సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలతో అనుసంధానం చేస్తూ భూ భారతి పోర్టల్‌ను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేస్తామన్నారు. ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావాల్సిన సమాచారం లభిస్తుందన్నారు.
క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్ ను రూపొందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ఆధునీకరణ చేసే ప్రతి పనిలో సామాన్యుని కోణం ఉండాలని, ఎలాంటి లోపాలకు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్ వేర్‌ను అభివృద్ది పరచాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, సీసీఎల్ఏ ఇన్‌ఛార్జి కార్యదర్శి మందా మకరంద్, ఎన్ఐసీ ఎస్‌ఐఓ ప్రసాద్, విజయ్‌మోహన్, కృష్ణ పాల్గొన్నారు.






