తెలంగాణ విజన్-​2047: రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్‌ ఇదే!

by Gantepaka Srikanth |

తెలంగాణ విజన్-​2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలపై ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నది.

తెలంగాణ విజన్-​2047: రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్‌ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విజన్-​2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలపై ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నది. 2035 నాటికి రాష్ట్రం వన్ ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల​ఎకానమే దీని లక్ష్యం. రాష్ట్ర అభివృద్ధికి ఒక విజన్​ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి కానున్న తరుణంలో 2047 పేరుతో ఈ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్టు తెలిసింది. అందుకే రాష్ట్రంలో ప్రధానమైన రంగాలను గుర్తించి వాటిలో అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను గుర్తించడం, దీంతో పాటు ఇక్కడున్న వనరులు, ఆ రంగానికి ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించడం, ప్రైవేటు రంగాన్ని సైతం ప్రోత్సహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సర్కారు టార్గెట్‌గా పెట్టుకున్నది.

అంతర్జాతీయ ప్రముఖుల సలహాలు, సూచనలు..

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రిటన్​మాజీ ప్రధాని టోని బ్లెయర్ చేసిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంది. ఆయనతో పాటుగా పలు రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రముఖులను సంప్రదిస్తున్నది. వారి సూచనలను తీసుకొని విజన్​డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నది. రాష్ట్రంలో ఫార్మా, ఐటీ, బయోటెక్నాలజీ, బల్క్​డ్రగ్, రియల్​ఎస్టేట్, పర్యాటకం, సినిమా, వ్యవసాయం, క్రీడా, ఎగుమతులు, డిఫెన్స్, టెక్స్‌టైల్స్​ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నది. ఆయా రంగాలను రాబోయే దశాబ్దంలో ఏ విధంగా అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం, అవకాశాలు కల్పన తదితర విషయాలపై ఒక్కో రంగానికి ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించనున్నది. సినిమా రంగం విషయంలో.. హాలీవుడ్ తరహాలో ఇక్కడ షూటింగులు జరిగేలా వసతులు, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాల కల్పినపై దృష్టి సారించనున్నది. అందుకోసం సినీరంగ ప్రముఖుల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా ప్రతి రంగానికీ సంబంధించిన ప్రముఖులతో చర్చించి విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు తీసుకురానున్నది.

నవంబర్ చివరికల్లా తుదిరూపు..

సెప్టెంబర్ 15 కల్లా విజన్ డాక్యుమెంట్​ ముసాయిదాను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దానికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముసాయిదా ప్రకటించిన తర్వాత అందరి అభిప్రాయాలను సేకరించి నవంబర్​చివరి కల్లా తుది రూపు ఇవ్వనున్నారు. డిసెంబర్​9న విజన్​ డాక్యుమెంట్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రముఖుల అభిప్రాయాలు, సలహాలు, సూచనల సేకరణ పూర్తయ్యాకే ఈ డాక్యుమెంట్​ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉపాధి కల్పనపై మేజర్ ఫోకస్

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. తెలంగాణలోని మానవ వనరులు, ప్రకృతి సంపద, వివిధ రంగాలకు ఇక్కడ పరిస్థితులు, ఇప్పటికే ఇక్కడున్న పరిశ్రమలు, అనుబంధ రంగాల పరిశ్రమలతో కొత్తగా వచ్చే వాటికి సులువుగా మెటీరియల్​లభ్యం కావడం సులభం అవుతాయి. ప్రపంచ స్థాయి ఐటీ, అనుబంధ కంపెనీల కార్యాలయాలు ఇక్కడ ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరికొంత శ్రమిస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. 2035 నాటికి వన్ ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్​డాలర్ల ఎకానమీ సాధించడం కష్టం కాదనే భావన ఆయనలో వ్యక్తమవుతున్నది. దీంతో పకడ్బందీగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే విజన్ డాక్యుమెంట్‌పై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ డాక్యుమెంట్ సాయంతో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Next Story