- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరా మహిళాశక్తి వేడుకల్లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు : మాజీ మంత్రి హరీశ్ రావు
మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హారీష్ రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హారీష్ రావు అన్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. అబద్దానికి అంగీ లాగు తొడుగుతే ఎట్లుంటది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్క ఉంటుందన్నారు. బాధ్యయుతమైన పదవిలో ఉండి జవాబుదారీతనంతో నిజాలు మాట్లాడాలని, ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పై అడ్డగోలుగా మాట్లాడారని ఇప్పుడు అధికారంలో ఉండి కూడా అవే అబద్ధాలు మాట్లాడుతున్నాడన్నారు. రూ. 21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు మోసం చేశారన్నారు. గత అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు సీతక్క ఇచ్చిన సమాధానం ప్రకారం.. 5లక్షల వరకు మాత్రమే ఎస్ హెచ్ జీ, స్త్రీనిధి రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణం అని, 2015లో అని కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పారన్నారు. కాగా, 12.5 శాతం బ్యాంకులు చార్జ్ చేస్తున్నాయన్నారు.
21వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే, మొత్తం 21వేల కోట్లు ఇచ్చినట్లు సీఎం రేవంత్ ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. 3, 4 కోట్లకే వడ్డీ లేని రుణాలు, మిగతా 16 వేల కోట్లకు 12 శాతం చొప్పున మహిళలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పెంచుతామని చెప్పి, 15 నెలలు గడుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5లక్షల పరిమితి వరకే వడ్డీ లేని రుణాలు (విఎల్ఆర్) ఉన్నాయని వీటికి సంబంధించి జీవో విడుదల చేయలేదన్నారు. మహిళా దినోత్సవం నాడైనా పది లక్షలకు పెంచుతూ కానుకగా జీవో ఇస్తారని అనుకున్నామని, కానీ అవే అబద్ధాలు, బీఆర్ఎస్ పై నిందలు తప్ప ఇచ్చింది, చేసింది ఏం లేదంటూ హారీష్ రావు ఫైర్ అయ్యారు.ఈ ఆర్థిక సంవత్సరంలో నయాపైసా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వడ్డీలేని రుణాల కింద విడుదల చేయలేదన్నారు. మహిళ దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా..? రేవంత్ రెడ్డి..? 21వేల కోట్లు ఇస్తే దానికి 2100 కోట్లు వడ్డీ అవుతుందన్నారు. మీ అబద్ధాలు వినలేక మహిళలు వెళ్లిపోయే ప్రయత్నం చేశారన్నారు. మీరుచెప్పిన 21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అనేది శుద్ధ అబద్ధమని, ఒక వేళ మీరు చెప్పింది అబద్ధం కాదని భావిస్తే 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, చెల్లించిన వడ్డీపై లెక్కలతో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
స్కూల్ యూనిఫాంలపై డబ్బా కొడుతున్నారు
స్కూల్ యూనిఫాంలను మహిళా సంఘాలకు ఇచ్చామని డబ్బా కొడుతున్నామని, స్టిచింగ్ ఛార్జీగా మేం జతకు 50 రూపాయలు ఇచ్చామని, కానీ 75 రూపాయాలకు రేవంత్ పెంచామని అబద్దం చెప్పారన్నారు. నిజానికి జతకు ఇచ్చింది 50 రూపాయలేనని, ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇస్తారు. అంటే రెండు జతలకు కలిపి రూ. 50 చొప్పున ఒక్కో మహిళకు బాకీ పడింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. రూ. 75 ఇచ్చింది నిజమయితే ఏ ఊళ్లో ఇచ్చారో చూపించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. చివరకు మొబైల్ ఫిష్ వ్యాన్లు కూడా తమ ఘనతగా చెప్పుకుంటున్నారని, పీఎం మత్స్య సంపద యోజన కింద 60శాతం సబ్సిడీ వస్తే, మిగతా 40శాతం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రుణం తీసుకుంటారని దీంట్లో రాష్ట్ర ప్రబుత్వం కాంట్రిబ్యూషన్ ఏముందో ప్రజలకు చెప్పాలని, మీ ఘనతగా చెప్పుకునేందుకు మీకు సిగ్గనిపించడం లేదా అంటూ హారీష్ రావు మండిపడ్డారు.
రేవంత్ ప్రమాద బీమా చెక్కుల పంపిణీ పెద్ద జోక్ గా మారిందని, ప్రజా పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా నవంబర్ 7, 2024న వరంగల్లో జరిగిన కార్యక్రమంలో 35 కోట్ల రూపాయల చెక్కును మహిళా సంఘానికి అందిచారని, కానీ అది క్లియర్ కాక 3 నెలల తర్వాత ల్యాప్స్ అయిందన్నారు. దానికి ఇంకో 9 కోట్లు కలిపి, నిన్న 44 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడైనా చెక్ పాస్ అవుతుందా లేదంటే ఇదే డ్రామా కొనసాగుతుందా, జూన్ 2కు మళ్లీ ఇదే చెక్కు ఇస్తారా..? అంటూ సీఎం ఇచ్చిన చెక్కు డమ్మీ అయిందంటూ సైటెర్లు వేశారు. సీఎం, డిప్యూటీ సీఎం లు ఇప్పటికైనా ఆ చెక్కులు పొందిన వారికి డబ్బులు వచ్చేలా చూడాలన్నారు.
భట్టి అంటే నాకు గౌరవం, రాజకీయాల్లో విలువలు పాటిస్తారనుకున్నా
భట్టి విక్రమార్కపై గౌరవం ఉందని, రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడిగా పేరుందని, కానీ రేవంత్ రెడ్డి దుష్ట సావాసంతో ఇప్పుడు భట్టి విక్రమార్క చెడిపోయారన్నారు. బాడీ షేమింగ్ చేయడం, అబద్ధాలు మాట్లాడంలో రేవంత్ రెడ్డితో పోటీపడుతున్నాడన్నారు. నేను మీ లాగా మాట్లాడగలను... నా ఎత్తు గురించి మాట్లాడం మీ విజ్జతకే వదిలే స్తున్నాని, నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యమని వారిలా దిగజారలేనని హారీష్ రావు తెలిపారు. మహిళలను కోటిశ్వరులు చేస్తామన్నారు కానీ ముందుగా చెప్పినవి అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పటి వరకు ఉన్న వడ్డీ లేని రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణం అని, ఎంత రుణం తీసుకుంటే అంత రుణం ఇస్తామని జీవో ను సవరించి విడుదల చేయాలన్నారు.
డిప్యూటీ సీఎం వెనక ముందు చూసుకోవాలని, రూ. 10 వేల కోట్ల వడ్డీలేని రుణాలు కూడా బీఆర్ఎస్ హయాంలో ఇవ్వ లేదని గొంతు చించుకున్నారన్నారు. ఒక్క 2022-23 లోనే రూ. 13 వేల కోట్లు ఇచ్చామని, మేం అధికారంలోకి వచ్చే నాటికి అప్పటి కాంగ్రెస్ 2, 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సెర్ప్, మెప్మా, స్త్రీనిధి ద్వారా మొత్తం లక్ష కోట్ల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చిందని గుర్తు చేశారు.నేను చెప్పేది తప్పయితే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. ఏ ఏడాది ఎంత ఇచ్చామో లెక్కలతో సహ చెబుతామన్నారు
రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ప్రకృతి పై నిందలు
రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ప్రకృతి మీద నిందలు వేస్తున్నాడని మండి పడ్డారు. ఎండలకు పంటలు ఎండుతున్నాయట, కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు లేవా.. ఎండలు మొదలు పుట్టాయా... రేవంత్ ముందు పుట్టిండా అంటూ ప్రశ్నించారు. ఈ సారి సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. కృష్ణా, గోదావరి పొంగి ప్రవహించాయి. అన్ని రిజర్వాయర్లు నిండాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ తెచ్చిన కరువు అన్నారు. కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రాగానే ఎందుకు మాయం అయ్యాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ నీళ్లను ఒడిసి పట్టాడని, రేవంత్ నీళ్లను వదిలి పెట్టలేదన్నారు. ఓ వైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేేవాదులలో కావాల్సినన్ని నీళ్లు ఉన్నా, మోటార్లను ఆన్ చేయలేదన్నారు.
వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతుందన్నారు. 7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్ద 32 రోజులు కార్మికులు సమ్మె చేశారన్నారు. 32 రోజులు నీళ్ల మోటార్లు ఆన్ చేయలేదన్నారు. కమిషన్ కుదురక 7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని ఎధ్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో చెరువులు, మత్తళ్లు దూకేవని, కాల్వలు నీళ్లతో కలకలలాడేవన్నారు. ఇదీ ప్రకృతి వైపరీత్యం కాదు, రేంవంత్ వైఫల్యం, మంత్రి వర్గ వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యమని ఆగ్రహించారు. కేసీఆర్ నిర్మించిన సమ్మక్క సాగర్ మూడున్నర టిఎంసీ నీళ్లు ఉన్నాయన్నాు. కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్ లు 25 రోజలుగా ప్రారంభించలేదన్నారు.
రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం
రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందమని హరీష్ రావు అన్నారు. హైడ్రాతో పేదల ఇళ్లు కూలగొట్టించి పైశాచిక ఆనందం పొందాడన్నారు. చిన్న పిల్లలు నీళ్ల డబ్బా, పుస్తకాలు తెచ్చుకుంట అంటే టైం ఇవ్వకుండా వారికి నిలువ నీడ లేకుండా చేశారని మండిపడ్డారు. లగచర్లలో గిరిజన రైతులకు బేడీలే వేశారని, ఆశా వర్కర్లను పోలీసులతో ఎగిరెగిరి కొట్టించారన్నారు, పేరు మర్చిపోయాడని, అల్లుఅర్జున్ ను అరెస్టు చేయించారని, అశోక్ నగర్ లో నిరుద్యోగుల వీపులు పగలగొట్టించారని, గుమ్మడి నర్సయ్య 4 సార్లు వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో మంత్రులది ఓ మాట.. ముఖ్యమంత్రిది ఓ మాట ఉంటుందని, రేవంత్ రెడ్డి సలహాలు ఇవ్వమంటాడు, మొన్న మేం ఎస్ ఎల్ బీ సీ వద్దకు వెళ్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు ఎవరి సలహాలు వద్దన్నారన్నారు. 16 రోజులు అవుతున్నా 8 మంది ప్రాణాల గురించి ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు.
ఒక మంత్రి చాపర్ లో తిరిగితే మరొకరు చేపల పులుసు తింటున్నారని, కన్వేయర్ బెల్టు ప్రారంభించడానికి పదిరోజులు పట్టిందన్నారు.అది ఒక్కరోజు నడిచి పోయిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి డైరెక్షన్ లేదు, సమన్వయం లేదని, ఇరిగేషన్ చీఫ్ అనిల్ కుమార్ ఈరోజు వరకు అక్కడికి పోలేదని ఎద్దేవా చేశారు. ఆయనకు ఎందుకు పోలేదని, ఆయనకు బాధ్యత లేదా అంటూ మండిపడ్డారు. ప్రమాద ఘటనను టూరిస్టు స్పాట్ లెక్క చేశారని దుయ్యబట్టారు.పదేండ్లలో తట్టెడు మట్టి తవ్వలేదని అబద్దాలు మాట్లాడారని, దానికి మొఖం పగిలే సమాధానం చెప్పామన్నాను. కాంగ్రెస్ హాయంలో 3300 కోట్ల పని చేస్తే, బీఆర్ఎస్ పదేండ్లలో 3, 900 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి అసహనం ఎక్కువైందని, పాలనమీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చరేసే ప్రయత్నం చేయాలని కోరారు. నిజాయితీగా పాలించు కమిషన్లు మానుకోవాలని హితవు పలికారు. కృష్ణా నది జలాలను ఏపీ తరలిస్తే, నేడు ఖమ్మం ప్రజలకు సీతారామా సాగర్ వరమైందన్నారు. కృష్ణా, గోదావరి సంగమం కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు. ఖమ్మం రైతాంగానికి నీరు సరఫరా అవుతుందన్నారు. 400 కోట్ల సన్న వడ్ల బోనస్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.






