ఖర్గే వ్యాఖ్యలపై రేవంత్ సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్

by Kema Shiva Kumar |

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను విష సర్పాలతో పోల్చిన మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖర్గే వ్యాఖ్యలపై రేవంత్ సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) తీవ్రంగా మండిపడ్డారు. విద్వేషపూరిత ప్రసంగాల (Hate Speech) విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇవాళ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హేట్ స్పీచ్‌’లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో బిల్లును పాస్ చేశారని అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పరిధిలోకి రావా అని ప్రశ్నించారు. బీజేపీ (BJP), ఆర్‌ఎస్‌ఎస్ (RSS)లను విష సర్పాలని ఖర్గే సంబోధించడాన్ని లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఉండి ప్రత్యర్థులను విషపూరిత పాములతో పోల్చడం, ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.

రేవంత్ రెడ్డి మౌనం ఎందుకు?

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు స్పందించడం లేదని, దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించాల్సిన నేతలే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడటం హేట్ స్పీచ్ కిందికే వస్తుందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని లక్ష్మణ్ అన్నారు.

Next Story