PG చేయాలనుకునే మెడికల్ స్టూడెంట్స్‌కు శాపంగా మారిన ఆ రూల్.. విషయం గ్రహించి అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య కూడా అధికమే.

PG చేయాలనుకునే మెడికల్ స్టూడెంట్స్‌కు శాపంగా మారిన ఆ రూల్.. విషయం గ్రహించి అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య కూడా అధికమే. దీంతో వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటున్నారు. అయితే వీరిలో పీజీ చేయాలనుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాల కోసం అమలు చేస్తున్న నిబంధనలు స్థానికులకు శాపంగా మారాయి. ఈ విషయంలో రాష్ట్రంలోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులకు సీట్లు దొరకడం గగనంగా మారింది.

50 శాతం ఓపెన్ కోటానే..

రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం మాత్రమే ప్రభుత్వ కోటా అమలవుతున్నది. మిగతా 50 శాతాన్ని ఎంక్యూ1, ఎంక్యూ2, ఎంక్యూ3గా విభజించారు. ఇందులో ఎంక్యూ1 ప్రకారం 25 శాతం జాతీయ స్థాయిలో, ఎంక్యూ2 ప్రకారం 15 శాతం ఎన్నారై కోటాగా, ఎంక్యూ3 ప్రకారం పది శాతం ఇనిస్టిట్యూషనల్ కోటాగా విభజించి ప్రవేశాలు జరుపుతున్నారు. అంటే 50 శాతం సీట్లను మాత్రమే తెలంగాణ విద్యార్థులు డైరెక్ట్ గా పొందుతుండగా.. మిగతా 50 శాతం కోసం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం విద్యార్థులతో పోటీ పడాల్సి వస్తున్నది. ఈ 50%లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రవేశాలు పొందిన తెలంగాణ విద్యార్థులు అతి తక్కువగా ఉండటం గమనార్హం.

ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త

పీజీ ప్రవేశాలకు సంబంధించి స్థానిక విద్యార్థులకు నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ పీజీ ప్రవేశాల్లో స్థానికులకు నష్టం జరగకుండా 2023 లో ఒక ప్రత్యేక జీవో (నంబర్ 102, తేదీ 15-07-2023)ను తీసుకువచ్చింది. మేనేజ్ మెంట్ కోటాలో ఇవ్వాల్సిన సీట్లకు సంబంధించి ఎస్ 1 కోటాలోని 25% సీట్లలో 85% సీట్లను ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే ఇచ్చేలా జీవో ని ప్రవేశపెట్టి అప్పటినుండే అమలు చేయడం ప్రారంభించింది. అంటే అక్కడి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ప్రతి 100 సీట్లలో 72 సీట్లు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు దక్కుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రతి 100 సీట్లతో 50 మాత్రమే ఇక్కడి విద్యార్థులకు కచ్చితంగా దొరుకుతున్నాయి.

రాష్ట్రంలోనూ అమలు చేయాలని..

ఏపీ తీసుకువచ్చిన జీవో లాంటిది తెలంగాణలో కూడా తీసుకొచ్చి రాష్ట్ర మెడికల్ స్టూడెంట్స్‌కు న్యాయం చేయాలని అనేక సార్లు కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండాపోతున్నదని వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీ మాదిరిగానే ఎంక్యూ1లోని 25 శాతం సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణవాసులకే కేటాయించేలా ప్రత్యేక జీవో తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక జీఓ తీసుకువచ్చేలా, పీజీ ప్రవేశాల్లో రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరిగేలా కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు.

Next Story