- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొర్రెములలో 'సర్కారీ' భూముల మాయాజాలం
ఘట్‌కేసర్ కొర్రెములలో నిషేధిత జాబితాలో ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమికి అక్రమంగా సేల్ డీడ్స్ చేస్తున్నారు. ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అందరూ శాకాహారులే.. కానీ కోడి మాయం’ అన్నట్లుగా ప్రభుత్వ భూముల పరిస్థితి తయారైంది. రికార్డుల్లో సర్కారివిగా, నిషేధిత జాబితాలో ఉంటున్న భూములే.. సబ్ రిజిస్ట్రార్ల చేతుల్లో సేల్ డీడ్స్ అవుతున్నాయి. స్థానిక సంస్థల అధికారులు సైతం భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. రికార్డులకు, క్షేత్రస్థాయికి మధ్య వేలాది ఎకరాల తేడా ఉంటుంది. ఆఖరుకు అసైన్డ్ భూములను సైతం వదలకుండా వందల కోట్ల విలువైన ల్యాండ్‌ను మాయం చేస్తున్నారు.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ.. ఇలా ఏ శాఖను నమ్మాలో తెలియక రికార్డుల పైనే అనుమానాలు కలుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని కొర్రెములలో రికార్డుల్లో భూములు పదిలంగా ఉన్నా.. ఆ శాఖ అధికారులే సేల్ డీడ్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 50 ఏండ్ల క్రితం సర్పంచ్ సంతకంతో లే అవుట్‌కు అనుమతి ఇచ్చినట్లుగా చూపిస్తే చాలు.. రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. అసైన్డ్ ల్యాండ్స్‌లోనూ అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎకరం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు పలికే ప్రాంతంలో అధికారుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నిషేధిత జాబితాలో ఉన్నా..
పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నంబర్‌లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంకటాద్రి టౌన్‌షిప్ పేరుతో 867 సర్వే నంబర్లోని కొంత భూమిని ఆక్రమించి వెంచర్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఫైల్ నెంబర్ బి-530-2007 ద్వారా క్రయవిక్రయాలు నిలిపివేస్తూ 2008 ఫిబ్రవరి 19న అప్పటి తహశీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి పీవోబీలో చేరిన ఈ ల్యాండ్ ధరణి-2020, భూ భారతి-2025 రికార్డుల ప్రకారం నేటికీ నిషేధిత (పీవోబీ-22ఏ) జాబితాలోనే ఉంది.
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 22-ఏ వివరాలపై ఘట్‌కేసర్ తహశీల్దార్, కీసర ఆర్డీవో, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ సైతం ఈ 20.32 ఎకరాలను సర్కారుదిగా నిర్ధారిస్తూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయినా సరే ఇక్కడ వెంకటాద్రి టౌన్ షిప్ ఎలా వచ్చింది? అనుమతులు, రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తగా ఇక్కడ సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ లేకుండాపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పెద్దల ఎంట్రీతో గప్‌చుప్..
కొర్రెములలో సర్వే నంబర్లు 870, 871, 872, 873, 875, 753, 853లలోని సుమారు 84.32 ఎకరాల భూమిలో ఓ రియల్టర్ ఎన్నో ఏండ్ల కిందట వెంకటాద్రి టౌన్‌షిప్ పేరుతో వెంచర్ చేశాడు. వీటితో పాటే 867లోని వరంగల్ హైవేకు సమీపంలో ఉన్న 20.32 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫేజ్ -1 నుంచి ఫేజ్-5 వరకు వెంచర్లు వేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులతో ఈ కబ్జా వ్యవహారం సెటిల్ చేసే క్రమంలో పెద్ద లీడర్లు ఎంట్రీ ఇవ్వడంతో అప్పట్లో ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వాళ్లు సీఎంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దాంతో అధికారులంతా గప్ చుప్ అయ్యారు.
మరి రిజిస్ట్రేషన్లు ఎలా?
నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది మార్చి 22న ఓ మాజీ ఎమ్మెల్యే సర్వే నంబరు 867లో 1,930 గజాల స్థలాన్ని మార్కెట్ విలువ ప్రకారం రూ.1.02 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. మిగతా ప్లాట్లన్నీ 200, 300 గజాలే ఉంటే.. ఇదొక్కటే 1930 గజాలుగా టౌన్ షిప్‌లో ఉన్నట్లు చూపించారు. ఎన్నో ఏండ్లుగా ఇది అసైన్డ్, ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నదన్న విషయం తెలిసినా.. మాజీ ఎమ్మెల్యే కొనుగోలు చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఇక్కడ వైన్స్ కోసం నిర్మాణం చేస్తుంటే హైడ్రా వచ్చి కూల్చేసింది. ఇప్పుడేమో యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడక్కడ గజం రూ. లక్ష పైమాటే. అంతటి విలువైన ప్రభుత్వ భూములు/అసైన్డ్ భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమాలకు ఊతమిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిషేధంలోనూ కొనుగోళ్లు..
దశాబ్దాలుగా బ్లాక్ లిస్టులో ఉన్న 867 సర్వే నంబర్లో ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని సర్కారు గుర్తించినా.. తాజాగా మళ్లీ సేల్ డీడ్స్ కావడం ఆందోళన కలిగిస్తున్నది. కేసుల పేరిట సామాన్యులకు నిషేధిత జాబితాలో కనిపించే ఈ పోర్టల్‌లో పెద్దలకు అవసరమైనప్పుడు మాత్రం రాత్రికి రాత్రే లాక్ తీసి, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అయ్యాక పీవోబీ జాబితాలో పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో గండిపేట, శేరిలింగంపల్లి మండలాల్లో జరిగిన తరహాలో ఇక్కడ కూడా కొన్ని సర్వే నంబర్లు, కంపెనీలు కొన్న భూములు మాత్రమే కొద్ది నిమిషాల పాటు ఎలా అన్ లాక్ అవుతున్నాయో? రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు స్పష్టం చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
9 జీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా?
అసైన్డ్ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అడిగితే.. తమకు 1950 లావుణి చట్టం రూల్స్ ప్రకారం రెగ్యులరైజ్ చేసిన సర్టిఫికెట్లు ఉన్నాయని రియల్టర్లు చెబుతున్నారు. సర్వే నంబర్ 867 లో నిజంగా 9 జీ సర్టిఫికెట్లు జారీ చేస్తే వాటిని ఎందుకు బహిర్గతం చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదే నిజమైతే అసైన్డ్ పట్టాదారుల వద్ద కూడా ఫీజులు తీసుకుని 9 జీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, లేదంటే పీవోబీ నిబంధనల ప్రకారం సర్కారీ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.గతంలో ఫిర్యాదులు రావడంతో 867 సర్వే నెంబర్‌లో మద్యం దుకాణం కోసం వేసిన భవనాన్ని స్థానిక రెవెన్యూ, పోలీసుల సహాయంతో హైడ్రా నేలమట్టం చేసింది. సరిగ్గా ఆ కూల్చివేతకు ఆనుకునే జరుగుతున్న ప్రభుత్వ భూమి ఆక్రమణలవైపు మాత్రం ఎందుకు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, హైడ్రా అధికారులు భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






