యువత పోకిరితనం... డేంజర్ లో వాస్తవ పరిస్థితులు : ఎక్స్ లో సీపీ సీవీ ఆనంద్

by Bhanu |

హైదరాబాద్ నగరంలో ఇటీవల ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) విజయం నేపథ్యంలో అభిమానుల తీరుపై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

యువత పోకిరితనం... డేంజర్ లో వాస్తవ పరిస్థితులు : ఎక్స్ లో సీపీ సీవీ ఆనంద్
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ నగరంలో ఇటీవల ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) విజయం నేపథ్యంలో అభిమానుల తీరుపై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 18వ కప్ గెలిచిన సందర్భంగా బెంగుళూరు టీం విజయోత్సవ ర్యాలీ జరిగిన సమయంలో పలుచోట్ల చోటు చేసుకున్న తొక్కిసలాటలు, అనాగరిక ప్రవర్తనను ఆయన ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) ఖాతాలో వివరించారు. ఈ సందర్భంగా సీపీ పోస్టు చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"ఇది ప్రపంచ కప్ కాదు…"

ఆర్సీబీ విజయం సందర్భంగా యువత గుంపులుగా అర్థరాత్రి రోడ్లపైకి రావడం, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ వద్ద అడ్డదిడ్డంగా హంగామా చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు తెలిపారు. “ఇది భారత క్రికెట్ జట్టు గెలిచిన ప్రపంచకప్ కాదని, వాణిజ్య ప్రాతిపదికన నడిచే ఒక ప్రైవేట్ ఫ్రాంచైజీ జట్టు గెలుపు మాత్రమే” అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడని గుర్తు చేశారు.

రాత్రిపూట హంగామా, ప్రమాదకర విన్యాసాలు

విజయోత్సవాల పేరుతో యువకులు రాత్రిపూట రోడ్డుపై మోటారుసైకిళ్లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, పరిస్థితిని తక్షణమే అదుపులోకి తేవడానికి నైట్ డ్యూటీ ఆఫీసర్లు పెద్ద ఎత్తున సిబ్బందిని రంగంలోకి దింపినట్టు తెలిపారు. యువకులు చేసిన అల్లర్ల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరట అయినప్పటికీ, ఇటువంటి ఘటనల వల్ల భవిష్యత్తులో అపార ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

"ఇది భద్రతకు ముప్పు"

అనుమతి లేకుండా, అకస్మాత్తుగా గుంపులుగా రోడ్లపైకి వచ్చి చేయబడుతున్న ఈ రకమైన పోకిరి చేష్టలు ప్రజా భద్రతకు ప్రమాదకరమని సీపీ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన సమాచారంతో ప్రజలు ఇలా అనూహ్యంగా రోడ్డుపైకి రావడం ఇప్పుడు పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలుగా మారిందని చెప్పారు.

"ఇలా అయితే ఎలా?"

ఇలాంటి చర్యల వల్ల నగరంలో ఏదైనా ప్రాణనష్టం జరిగినపుడు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తుగా అనుమతులు లేవు, భద్రతా ఏర్పాట్లూ లేవు. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆ స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి వస్తోంది. ప్రతి సందర్భంలో పోలీస్ సేవలు అందించడం మానవపరంగా సాధ్యం కాదని సీపీ పేర్కొన్నారు.

ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా యువతతో పాటు తల్లిదండ్రులు, సమాజం మొత్తం చైతన్యవంతం కావాలని, సామాజిక బాధ్యతతో ప్రవర్తించాలంటూ ఆయన సూచించారు. జరగాల్సిన చోట ఆనందాలు జరుపుకోవడం తప్పు కాదన్నా, భద్రతా పరంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.




Next Story