రేషన్‌కార్డుదారులకు తీవ్ర నిరాశ.. ఈ నెల సరుకుల ‘సంచి’ లేనట్టే..

by Bhoopathi Nagaiah |

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణ సర్కార్ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి బ్రేక్ పడింది.

రేషన్‌కార్డుదారులకు తీవ్ర నిరాశ.. ఈ నెల సరుకుల ‘సంచి’ లేనట్టే..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. కొత్త కుటుంబాలకు కార్డులు, పేర్ల చేర్పులు, మార్పులు కూడా దశాబ్ధం తర్వాతే అయ్యాయి. ఇక పాత రేషన్ కార్డుదారులతోపాటు కొత్త కార్డుల లబ్ధిదారులు సైతం సన్నబియ్యం తీసుకుంటున్నారు. అయితే వీరికి ఇకపై సంచులలో బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 కిలోల బియ్యం పట్టే విధానంగా రూపొందించిన ఆ సంచులను లబ్ధిదారులకు అక్టోబర్ నెల బియ్యంతోపాటు అందించేందుకు సర్కార్ కసరత్తు చేసింది. కానీ అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో ఈ బృహత్తర కార్యక్రమానికి బ్రేక్ పడింది.

రేవంత్ సర్కార్ ఈ సంచులను మల్టీపర్పస్‌గా వినియోగించుకునేలా రూపొందించింది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా పర్యావరణ హితంగా, ఎక్కువ రోజులు ఉపయోగించుకునేలా మన్నికతో తయారు చేశారు. వీటి ద్వారా కేవలం రేషన్ బియ్యమే కాకుండా కూరగాయలు, సరుకులు, ఇతర వస్తువుల రవాణాకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఈ సంచులను రెడీ చేసింది. వీటిని ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు తరలించగా... సివిల్ సప్లయ్ శాఖ అధికారులు ఆయా మండలాల స్టాక్ పాయింట్లకు సరఫరా చేశారు. ఈ నెల 1 నుంచి బియ్యం పంపిణీ ఈ సంచుల ద్వారానే చేయాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. సంచులపై మూడు రంగులు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో ముద్రించారు. అలాగే ఆరు గ్యారెంటీల లోగోను చేర్చాను. ఈ కారణంగానే ఎన్నికల సంఘం రేషన్ బియ్యం సంచుల పంపిణీ నిలిపివేసినట్టు తెలుస్తోంది.

Next Story