- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. రూ.12,500 కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్ ఎంవోయూ
దావోస్ వేదికగా తెలంగాణ పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ (Telangana Rising) ప్రతినిధుల బృందం దావోస్ (Davos) పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతూనే ఉంది. పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్(Rashmi Group), తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2026 సదస్సులో భాగంగా ఇవాళ ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం రష్మి గ్రూప్‌తో కలిసి రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.
స్టీల్ ప్లాంట్ సహకారమందిస్తాం:
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు.. తెలంగాణ విభిన్న పరిశ్రమలతో బలమైన పారిశ్రామిక వ్యవస్థగా ఎదుగుతోందని, ముఖ్యంగా తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు బొగ్గు సరఫరా లింకేజీలు సహా అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రష్మి గ్రూప్ డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లేబర్–ఇంటెన్సివ్ తయారీ విధానంతో పనిచేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ భేటీలో రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి సైతం ఉన్నారు. ఈ సమావేశంలో గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిగాయి. రష్మీ గ్రూపు ఆసియాలోని 40 దేశాలు, యూరప్, ఆఫ్రికా, ఉత్తర,దక్షిణ అమెరికా దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.






