ఆక్రమణల తొలగింపులో పక్షపాతం ఏల...?

by Batti.Sumithra |

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇంతకాలం ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌ల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.

ఆక్రమణల తొలగింపులో పక్షపాతం ఏల...?
X

దిశ, తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇంతకాలం ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌ల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. తాండూరు పట్టణంలో ఇరువైపులా డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ పరిధిలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఆక్రమణల పై మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు రోడ్ల స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు అధికారులు ఇప్పటికే వాటికి మార్కింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు పట్టణంలోని బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించగా, ప్రస్తుతం ఆ ప్రాంతం విశాలంగా దర్శనమిస్తోంది. అలాగే బస్ స్టేషన్ నుంచి ఇంద్రాచౌక్, రైల్వే స్టేషన్, గాంధీ చౌక్ మార్గంలో ఆక్రమణల తొలగింపు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్రఇబ్బందులు కలుగుతున్నప్పటికీ బస్ స్టేషన్ సమీపంలో చేసినట్టు మిగతా ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సంవత్సరాలుగా పాతుకుపోయారు...!

తాండూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా ఫుట్‌పాత్‌లను ఆనుకొని వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అందులో చిరువ్యాపారులు టేలాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుండగా, కొందరు రాజకీయ నాయకులు సైతం తమ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఫుట్‌పాత్‌లను ఆనుకొని వ్యాపారాలకు అనువుగా ఉండే స్థలాల పై కన్నేసిన నాయకులు తమ పలుకుబడితో వివిధ ప్రాంతాల్లో విచ్చలవిడిగా టేలాలు ఏర్పాటు చేశారు. వాటిని చిరువ్యాపారులకు అద్దెకిస్తూ నెలవారీ అద్దె రూపంలో వేలల్లో దోచుకుంటున్నారు. అయినా ఇంత కాలం వాటిపై ప్రశ్నించే నాథుడే లేకపోయాడు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వాటి వెనుక ప్రజాప్రతినిధుల అండ ఉండగా, నెలకు లక్షల రూపాయలు కిరాయిల రూపంలో చేతులు మారుతున్నాయి. మున్సిపల్ అధికారులు అక్రమ టేలాల పై దృష్టి సారించి తొలగించేందుకు ప్రయత్నించినా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

బడా వ్యాపార సంస్థలనూ వదలని వైనం...?

మున్సిపల్ చైర్‌పర్సన్ ఆదేశాలతో చిరువ్యాపారుల పై కొరడా ఝళిపిస్తున్న అధికారులు బడా వ్యాపార సంస్థలపైనా చర్యలు తీసుకుంటారా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రోడ్డులో బడా దుకాణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటికి ఆనుకొని నిర్మించిన మెట్లు దాదాపుగా ఫుట్‌పాత్‌ను ఆక్రమించాయి. అవి తొలగిస్తేగానీ ఆక్రమణలు పూర్తిగా తొలగి, రహదారులు పూర్వపు రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. అయితే పలుమార్లు బడా షాపింగ్ కాంప్లెక్స్‌ల మెట్లు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించినా, ఒత్తిళ్ల కారణంగా అవి సఫలీకృతం కాలేదు. కేవలం చిరువ్యాపారులపైనే తమ ప్రతాపం చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డ్రైనేజీల వరకు అన్ని ఆక్రమణలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొందరు అడ్డుపడుతున్నట్లు సమాచారం. అలాగే పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను కూడా త్వరగా తొలగిస్తే తాండూరు పట్టణం సర్వాంగ సుందరంగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సెల్లార్లను ఖాళీ చేయించాలి...

తాండూరు పట్టణ ప్రధాన వీధుల్లో ప్రస్తుతం వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బహుళ అంతస్థుల భవనాల సెల్లార్లను ఖాళీ చేయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కేంద్రంలో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా పలు రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పండుగల రోజుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.

బహుళ అంతస్థుల భవనాల్లో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భవనాల సెల్లార్లలో పార్కింగ్‌కు స్థలం వదిలివేయాల్సి ఉండగా, యజమానులు వాటిని కూడా అద్దెకు ఇవ్వడంతో వాహనాలు రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు సెల్లార్లను ఖాళీ చేయించడం ద్వారా పార్కింగ్ ఇబ్బందులు తొలగిస్తామని చెబుతున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భవనాల యజమానులు సెల్లార్ల రూపంలో లక్షల్లో కిరాయలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న నేపథ్యంలో సెల్లార్ షాపులపైనా దృష్టి సారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సెల్లార్లను ఖాళీ చేయించి పార్కింగ్ ఏర్పాటు చేస్తే రహదారుల పై వాహనాలు నిలిపే అవసరం ఉండదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

Next Story