బ్రౌన్ బ్రీచ్ కేమ్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు

by Disha Web Desk 12 |
బ్రౌన్ బ్రీచ్ కేమ్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు
X

దిశ, తాండూరు రూరల్: ఆ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తుంది. రసాయన వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా వదులుతుండడంతో నీటి కాలుష్యంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, భూములు సారాన్ని కోల్పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరించలేని వాసన వస్తుందని, భూగర్భ జలాలు రంగు మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని స్థానికుల వాదనలు వినిపిస్తున్నాయి.

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మిట్టబాష్పల్లి సమీపంలో ఆసియా బ్రౌన్ బ్లీచ్ కేమ్ జిప్సం లిమిటెడ్ కంపెనీలో జిప్సం తయారీ యూనిట్‌ను దర్జాగా కొనసాగిస్తున్నారు. దీంతో ఐన్నెల్లి, కోట బాష్పల్లి, జింగుర్తి, గుంతబాష్పల్లి, మిట్టబాష్పల్లి గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కూడా పొలాలు దెబ్బ తినడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమై బోర్ల నుంచి వచ్చే నీరు కంపుకొడుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ జిప్సం కంపెనీ నుంచి పలు గ్రామాలు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ కంపెనీ ఎదుట భారీ ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

స్థానికుడి అండతో..

స్థానికులు కంపెనీపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన లోకల్ వ్యక్తి అండదండలు ఉండడంతో తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోయింది.

హైదరాబాద్ నుంచి వ్యర్థ పదార్థాలు

హైదరాబాద్ నుంచి భారీ కంపెనీల ద్వారా వ్యర్థ పదార్థాలను తీసుకువచ్చి ఇక్కడ జిప్సం తయారు చేయడంలో వాడుతారు. నాపరతి బండల ద్వారా వెలువడే సుద్ధలో యాసిడ్ రసాయనాలు మిక్స్ చేసే సమయంలో వెలువడుతున్న దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గాలి, నీరు కలుషితం..

శివారులోని పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలను వ్యవసాయ భూములకు తరలిస్తుండడంతో బోర్ల నుంచి కలుషిత జలాలు ఉబికి వస్తున్నాయి. వర్షాలు పడినప్పుడల్లా వర్షం నీటితోపాటు రసాయన పదార్థాలు కాలువల ద్వారా పొలాల్లోకి పారుతున్నాయి. దీంతో పరిసరాలన్నీ దుర్వాసన గా మారుతున్నాయి. పీల్చే గాలి నుంచి, తాగే నీటి వరకు కలుషితమై కారు మబ్బులా కమ్ముకుంటోంది. భూగర్భ జలాలు రంగు మారుతున్నాయి. ప్రజలు తెలియని దీర్ఝకాలిక రోగాల బారిన పడుతున్నారు.

Next Story

Most Viewed