అంతర్ రాష్ట్ర కరెంట్ దొంగల ముఠాలోని ముగ్గురు అరెస్ట్..

by Disha Web Desk 20 |
అంతర్ రాష్ట్ర కరెంట్ దొంగల ముఠాలోని ముగ్గురు అరెస్ట్..
X

దిశ, బడంగ్ పేట్ : ట్రాన్స్ ఫార్మర్ లలోని కాపర్ కాయిల్స్ ను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతర్ రాష్ట్ర కరెంట్ దొంగల ముఠాలోని కరడుగట్టిన ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ పరిధిలతో పాటు మరికొన్ని జిల్లాలలో విద్యుత్ సరఫరా చేస్తున్న 306 ట్రాన్స్ ఫార్మర్ లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్ ను దొంగిలిస్తున్నారని చెప్పారు. ప్రధాన నిందితుడు సహాదేవ్ మీద 173 కేసులు, అభిమన్యు రాజ్ బార్ మీద 84 కేసులు, నందులాల్ రాజ్ బార్ మీద 84 కేసులు, రాహుల్ రాజ్ బార్ మీద 107 కేసులు, రాంచందర్ మీద 84 కేసులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. కరెంట్ దొంగల ముఠాలో ఐదుగురు యువకులు ప్రత్యక్ష్యంగా దొంగతనాలకు పాల్పడగా, మరో నలుగురు నిందితులు వారికి పరోక్షంగా సహకరించినట్లు తెలిపారు.

ఈ ముఠాలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఆరుగురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి వద్ద నుంచి ఒక లక్ష రూపాయల నగదుతో పాటు 60 కిలోల ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్, ఒక టాటా ఇండికా కారు, ఒక బజాజ్ పల్సర్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్స్, దొంగ తనానికి ఉపయోగిస్తున్న టూల్ కిట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పహాడీ షరీఫ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈ నెల 4 వ తేదీన సాయంత్రం 4గంటలకు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగిరి చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల టాటా ఇండికా కారులో ముగ్గురు వ్యక్తులు అటుగా వస్తున్న విషయాన్ని గుర్తించారు. కారు ఆపి అందులో సోదాలు నిర్వహించగా పెద్ద మొత్తంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ ఉండడంతో పోలీసులు తనదైన స్టైల్ లో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు.

విలాస వంతమైన జీవితం కోసం చోరీలు..

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బాలియా పాల్ కు చెందిన సహదేవ్ హాజ్రా (32) గత కొంతకాలం క్రితం రాజేంద్రనగర్ కాటేదాన్ కు వలస వచ్చాడు. సహదేవ్ వృత్తి రిత్యా పెయింటర్. ఉత్తర్ ప్రదేశ్ ఆజంఘార్ కు చెందిన అభిమన్యు రాజ్ బార్ (37) వృత్తి రిత్యా గ్యాస్ వెల్డర్, నందు లాల్ రాజ్ బార్(30), రాహుల్ రాజ్ బార్, రామ్ చందర్ లు చెడు అలవాట్లకు బానిసలయ్యారు. విలాస వంతమయిన జీవితం కోసం అందరూ కలిసి ట్రాన్స్‌ఫార్మర్‌ల లోని కాపర్ కాయిల్స్ దొంగిలించాలని పథకం పన్నారు. వీరికి కురువ చిన్న నరసింహులు, ఉత్తల్ మహేష్, మైలార్ దేవ్ పల్లి కి చెందిన తులుగు రమణా రెడ్డి (45) స్క్రాబ్ వ్యాపారి. బుద్వేల్ కు చెందిన రంజాని జయశ్రీ (34) స్క్రాబ్ వ్యాపారులు సహకరించేవారు.

పక్కా ప్లాన్ తో రెక్కీ...

ఒక్కొక్క ట్రాన్స్ ఫార్మర్ నుంచి కాపర్ కాయిల్స్ దొంగిలిస్తే ఒక లక్ష వరకు వస్తాయని పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. దానికి కావలసిన పల్సర్ బైక్, టాటా ఇండికా కారు, టూల్ కిట్ ను కొనుగోలు చేశారు. ముందుగా కాస్త నిర్మానుష్య ప్రదేశం లోని ట్రాన్స్ ఫార్మర్ లను ఎంచుకునే వారు. అర్థరాత్రి వేళలో పల్సర్ బైక్ పై రెక్కీ నిర్వహించే వారు. అక్కడ ఎవరు లేరు... దొంగ తనానికి సులువుగా ఉన్నాడని నిర్దారించుకున్నాక... కాస్త దూరంలో కారును నిలిపేవారు. మరో ఇద్దరు రాక పోకలను గమనిస్తుండే వారు. అంతా ఒకే అని సిగ్నల్ ఇచ్చుకున్నాక ఆ ముఠాలోని ఓ ఎలక్ట్రిషన్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫేస్ టు ఫేస్ కలిపి ట్రిప్ అయ్యేలా చేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. టూల్ కిట్ సహాయంతో ట్రాన్స్ ఫార్మర్ లోని ఆయిల్ ను తీసి కింద పడవేస్తారు. అందులోని కాపర్ కాయిల్స్ ను దొంగిలించి కారులో పరారవుతారు. దొంగిలించిన కాపర్ కాయిల్స్ ను ఇద్దరు స్క్రాబ్ వ్యాపారులకు విక్రయించేవారు.

ఇదిలా ఉండగా పెద్ద మొత్తంలో ట్రాన్స్ ఫార్మర్ లను ధ్వంసం చేసి అందులో నుండి కాపర్ కాయిల్స్ దొంగిలిస్తున్నారని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సీసీ ఎస్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. రాచ కొండ సీ సీ ఎస్ పోలీసులతో కలిసి ఈ కరెంట్ దొంగల ముఠా ను అదుపులో కి తీసుకుని విచారిస్తే పోలీసులే ఓ దశలో అవాక్కయ్యారు. పరారీలో ఉన్న మరో అరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ట్రాన్స్ ఫార్మర్స్ లోని కాయిల్స్ దొంగిలి స్తున్నట్లు గుర్తించారు. మీడియా సమావేశంలో రాచకొండ కమిషనరేట్ సీసీ ఎస్ క్రైమ్ డీసీపీ మధుకర్ స్వామి, మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్, భువన గిరి డీసీపీ, ఏసీపీ, మహేశ్వరం ఏసీపీ అంజయ్య,సీసీ ఎస్ ఎల్ బీ నగర్ ఇన్స్ పెక్టర్ లు యాదయ్య, రవీందర్, ఎస్సైలు జయ రాం, కృష్ణారావు, ఏఎస్సై యాది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed