కుల సంఘాల ఎన్నికలను తలపిస్తున్న‘ పంచాయతీ’

by velandi.Saikiran |   (  Updated:2025-12-05 20:30:46  IST  )

స్థానిక సంస్థల ఎన్నికలు కుల సంఘాల ఎన్నికలను తలపిస్తున్నాయి. సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేసిన అభ్యర్థులు

కుల సంఘాల ఎన్నికలను తలపిస్తున్న‘ పంచాయతీ’
X

కుల సంఘాల ఎన్నికలను తలపిస్తున్న‘ పంచాయతీ’

- సామాజిక వర్గాల సమీకరణాల చుట్టే రాజకీయం

- కుల పెద్దలను మచ్చిక చేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు

దిశ, ఆమనగల్లు : స్థానిక సంస్థల ఎన్నికలు కుల సంఘాల ఎన్నికలను తలపిస్తున్నాయి. సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేసిన అభ్యర్థులు కుల పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆమనగల్లు మండలంలో 13 గ్రామాలకు, కడ్తాల్ మండలంలో 24 జీపీలకు, తలకొండపల్లి మండలంలో 32 గ్రామాలకు ఈనెల 14నస్థానిక ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులకు గుర్తులు రాక ముందే పోటీ దారులు కుల సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కుల సంఘాలను ప్రసన్నం చేసేకునేందుకు ప్రయత్నం

ఈ మండలాల్లో వివిధ గ్రామాలలో అత్యధిక ఓట్లు కలిగిన కుల సంఘాల ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు కుల సంఘాల పెద్దలతో పోటీదారులు చర్చలు జరుపుతున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది ఆ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, విందు వినోదాలు అందజేసేల ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు కుల సంఘాల ఎన్నికలను తలపిస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

కుల పెద్దలకు ఆఫర్లు..

ప్రస్తుతం పోటీదారుల దృష్టి అంతా కుల సంఘాలపైనే కేంద్రీకృతమైంది. వారి ఓట్లు లబ్ధి పొందేందుకు కుల సంఘాల పెద్దలకు అదిరిపోయే ఆఫర్లు అందజేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సంఘాల భవనాలకు మరమ్మత్తులు, బోర్లు వేయించడం, ఆలయాలు ఉంటే వాటికి పలు సౌకర్యాలు కల్పించడం ఇలా ఎన్నో రకాల హామీలను అభ్యర్థులు కుల సంఘాల పెద్దలకు అందజేస్తున్నారు. కుల సంఘాలకు గాలం వేసి సునయాస విజయం సాధించవచ్చనే భావనలో పోటీ దారులు ఉన్నారు. ఏది ఏమైనా కుల సంఘాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్రంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

Next Story