బుజ్జగింపులు.. బేరసారాలు

by velandi.Saikiran |   (  Updated:2025-12-01 21:15:59  IST  )

బుజ్జగింపులు.. బేరసారాలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీని రెబెల్స్ బెడద వెంటాడుతోంది. తొలి విడతలో జరిగే సర్పంచు, వార్డు స్థానాలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఒక్కో చోట సర్పంచు పదవికి ఐదు నుంచి పది మంది వరకు దరఖాస్తు చేశారు. అధికార పార్టీలోనే పోటీ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుండగా.. రెబెల్స్​‍ను బుజ్జగించి పోటీ నుంచి తప్పించడం నేతలకు తలప్పిగా మారింది. డిసెంబరు 3న నామినేషన్ల గడువు ముగియనుండడంతో అప్పటి‌లోగా రెబెల్స్​‍ను బరిలో నుంచి తప్పించేందుకు నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ససేమిరా అంటున్న అభ్యర్థులు..

పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరుగుతున్నప్పటికీ..రాజకీయ పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలా ఏళ్లుగా గ్రామ స్థాయిలో పదవులకు దూరంగా ఉన్న నేతలకు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో పదవులు పొందేందుకు తహతహ లాడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇదే సరైన సమయంగా భావించి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో తొలి విడత ఎన్నికలు ఫరూక్‌ నగర్‌, చౌదరి గూడెం, కేశం పేట, కొత్తూరు, కొందుర్గు, నందిగామ, శంషాబాద్‌ మండలాల్లోని 174 సర్పంచు స్థానాలకు, 1,170 వార్డు స్థానాలకు జరుగుతున్నాయి.

సర్పంచు స్థానాలకు మొత్తం 1,170, వార్డు స్థానాలకు 4,550 నామినేషన్లు వచ్చాయి. పరిశీలన అనంతరం సర్పంచు స్థానాల్లో డూప్లికేట్‌ నామినేషన్లు 323 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే ఒక నామినేషన్‌ ను తిరస్కరించారు. దీంతో ఇంకా 846 నామినేషన్లు సర్పంచు స్థానానికి అర్హతను పొందాయి. వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్లలోనూ 409 డూప్లికేట్‌ గా గుర్తించిన అధికారులు.. మరో 18 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. పరిశీలన తర్వాత 4,123 నామినేషన్లు అర్హత పొందాయి. ఇక నామినేషన్ల విత్‌ డ్రా కు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో నేతల్లో ఒకింత టెన్షన్‌ నెలకొంది. ఎక్కడికక్కడ రెబల్స్ తో ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ససేమిరా అంటున్న చోట ఏకంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగుతున్నట్లు తెలిసింది.

అభ్యర్థులకు ఆఫర్లు..

స్థానిక ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఏకగ్రీవం కోసం ప్రయత్నించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సైతం దిశా నిర్దేశం చేయడంతో నేతలు ఆ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఏకాభిప్రాయ సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీచేసే ఛాన్స్​ ఉంటుందని, మరికొందరికి ఇతర నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల బరి నుంచి తప్పించేందుకు ప్యాకేజీ సైతం ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక రెండో విడత ఎన్నికలు జరుగుతున్న ఆమన్‌ గల్‌, చేవెళ్ల, కడ్తాల్‌, మొయినాబాద్‌, షాబాద్‌, శంకర్‌ పల్లి, తలకొండ పల్లి మండలాల్లోనూ నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలవుతున్నాయి. దీంతో ఇక్కడ కూడా అధికార పార్టీకి రెబెల్స్, బెడద తప్పేలా లేదు. అధికార పార్టీలో కన్పిస్తున్న ఈ టెన్షన్‌ బీఆర్‌ఎస్, బీజేపీలో మాత్రం కనిపించడం లేదు. పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించక పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Next Story