ఎఫ్-లైన్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

by Taduka Kalyani |

ఎఫ్-లైన్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి అన్నారు.

ఎఫ్-లైన్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
X

దిశ, ఇబ్రహీంపట్నం : ఎఫ్-లైన్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి తన ఛాంబర్‌లో సహాయ సంచాలకులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (ఏడీ, ఎస్‌ఎల్‌ఆర్) ఆధ్వర్యంలో జిల్లాలోని మండల సర్వేయర్లు, డీఐఓఎస్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎఫ్-లైన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, సేవా హామీ చట్టం (ఎస్ఎల్ఏ) గడువును దాటిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత సర్వేయర్లను ఆదేశించారు. మండలాల వారీగా ఎఫ్-లైన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల స్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సేవా హామీ చట్టం గడువును దాటిన కేటగిరీ-బి దరఖాస్తులపై ప్రత్యేకంగా చర్చించి, తదుపరి సమీక్ష సమావేశం నాటికి అన్ని పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు లేదా ఆరోపణలకు తావు లేకుండా పారదర్శకతతో పని చేయాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ సేవలను సకాలంలో ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సహాయ సంచాలకులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాంరెడ్డి, మండల సర్వేయర్లు, డీఐఓఎస్‌లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story