- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Real Rising : పట్టాలెక్కుతున్న రియల్ ఎస్టేట్.. పెరుగుతున్న ఆదాయం..!

దిశ, రంగారెడ్డి బ్యూరో : హైదరాబాద్ నగరంలో ఒక భాగమైన రంగారెడ్డి జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ క్రమక్రమంగా పట్టాలెక్కుతున్నది. 2023-24 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ప్రభావం. దేశ వ్యాప్తంగా చోటుచేసుకున్న స్తబ్దత కారణంగా గతేడాది స్థిరాస్తి రంగంలో పెద్దగా వృద్ధి నమోదు కాలేదు. కాగా ఈ ఏడాది పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రారంభంలో హెచ్చుతగ్గులు కనిపించినా.. గడచిన రెండు నెలల కాలంలో ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ల మూలంగా స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న ఆదాయ గణాంకాలు సైతం వ్యవసాయేతర రంగం పుంజుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి.
ఇక్కడి మార్కెట్టే.. ది బెస్ట్
హైదరాబాద్ సిటీతో పోటీ పడుతూ.. అంచెలంచెలుగా ఎదుగుతున్న రంగారెడ్డిలో దాని జిల్లా విస్తీర్ణం, జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నది. ఇతర సిటీలకు పోటీగా మెట్రో రైలు, ఎయిర్ పోర్టు, ఔటర్ రింగు రోడ్డు వంటి రవాణా సదుపాయాలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజీలు, ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు శివారు ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఈ ప్రాంతానికి అదనపు జలాల సేకరణ, మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులపై సర్కారు ఫోకస్ చేయడం కూడా రియల్ రంగంలో మరింత జోష్‌ను పెంచాయి. అందుకే ఇక్కడి రియల్ మార్కెట్ బెస్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సదుపాయాలు.. అభివృద్ధి
50 ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మహేశ్వరం వద్ద ఫోర్త్ సిటీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్ తదితర ప్రత్యేకతలతో కొత్త నగరం ముస్తాబవుతోంది. అలాగే ఔటర్‌కు సమీపంలో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ సదుపాయాలు అభివృద్ది చెందాయి. దీంతో నివాసయోగ్యమైన ప్రాంతంగా ఇది గుర్తింపును సాధించింది. ఇక్కడ పెట్టుబడి పెడితే ప్రతిఫలం బాగుంటుందనే అభిప్రాయం సైతం చాలామందిలో నెలకొన్నది. ప్లాట్లు, ఇండ్ల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాల వారు, ఎన్‌ఆర్‌ఐలు సైతం ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మూడో వంతు ఆదాయం ఇక్కడి నుంచే..
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉన్నప్పటికీ.. రంగారెడ్డి జిల్లాను ఆనుకుని ఉన్న హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం జోరు తగ్గడం లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు యేటా రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో మూడో వంతు, అంటే.. రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచే వస్తున్నది. ప్రతీ సంవత్సరం ఆదాయ పరంగా రంగారెడ్డి జిల్లానే టాప్‌లో ఉంటూ వస్తోంది. ఈ ఏడాదిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్లాట్లు, ఇండ్ల అమ్మకాలు పెరగగా.. ఈ 9 నెలల కాలంలోనే రూ.3,227.49 కోట్ల ఆదాయం సమకూరింది. 3 నెలల తర్వాత వచ్చే ఆదాయం గతంలో కంటే ఎక్కువగానే ఉండనున్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకురావడం. ప్రజలకు వేగవంతమైన, సులభతరమైన సేవలను అందించడంలో భాగంగా స్లాట్ విధానాలను అందుబాటులోకి తేవడం వంటి చర్యలు, అటు స్థిరాస్తి రంగానికి, ఇటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు జవసత్వాలు తెచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు.






