ఆ భూమిపై జయశ్రీకి ఎలాంటి హక్కులు లేవు.. ఆర్డీవో వెంకటాచారి

by Dishafeatures2 |
ఆ భూమిపై జయశ్రీకి ఎలాంటి హక్కులు లేవు.. ఆర్డీవో వెంకటాచారి
X

దిశ, తుర్కయంజాల్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కవాడిపల్లిలోని సర్వే నెంబర్‌ 67లో తమ భూమిని ఎమ్మార్వో అండదండలతో రియల్టర్లు కొట్టేస్తున్నారన్న జయశ్రీ ఆరోపణల్లో నిజం లేదని ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్‌ అనితారెడ్డి తేల్చి చెప్పారు. తుర్కయంజాల్‌లోని కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్‌ అనితారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. 1.35 గుంటల భూమి విషయంలో బి.జయశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆ భూమిపై జయశ్రీకి ఎలాంటి హక్కులు లేవన్నారు. సర్వే నెంబర్‌ 67లో మొత్తం 7.25గుంటల భూమికి సుర్వి మల్లయ్య పట్టాదారు అని, ఆయన మరణానంతరం సాదా సేల్‌డీడ్‌ ద్వారా ఆయన కుమారులు అమ్ముకున్నారని తెలిపారు. 2011లో ఆ భూమిని సుర్వి దానయ్య, దానమ్మ, శంకర్‌, కురుపతి మోహన్‌రాజుకు అమ్మడంతో వారు సేల్‌ డీడ్‌ చేసుకున్నట్లు తెలిపారు. అయితే కేసీఆర్‌ సర్కార్‌ తెచ్చిన ధరణి పోర్టల్‌లో ఈ భూమి వివరాలు నమోదు కాలేదని, పోర్టల్‌లో తన పేరే చూపిస్తుండటంతో దీన్ని సుర్వి భిక్షపతి ఆసరాగా తీసుకొని తమ కూతుర్ల పేరిట గిఫ్ట్‌ డీడ్‌ చేసినట్లు తెలిపారు. ఆ భూమి తమదేనంటూ పాసు పుస్తకాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న నిజమైన పట్టాదారులు కోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు.

పూర్వాపరాలు తెలుసుకున్న ధర్మాసనం సుర్వి దానమ్మ, శంకర్‌, కురుపతి మోహన్‌రాజుకే ఈ భూమి దక్కుతుందని తీర్పునిచ్చినట్లు తెలిపారు. కోర్టు తీర్పు ఆధారంగానే కలెక్టర్‌కు నివేదించి, తహసీల్దార్‌ ధరణిలో పేర్లు నమోదు చేసేందుకు సిఫారసు చేశారన్నారు. ఈ భూమి విషయంలో సుర్వి భిక్షపతి కూతురు జయశ్రీకి ఎలాంటి హక్కులు లేవని, లేని భూమికి తన తండ్రి గిఫ్ట్‌ డీడ్‌ చేశారన్నారు. విషయం తెలుసుకోకుండా జయశ్రీ అత్యాశకు పోయి, తహసీల్దార్‌, ఇతర సిబ్బందిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాగా.. కబ్జాదారులకు ఎమ్మార్వో అండగా నిలబడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌ ఎదుట జయశ్రీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed