రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన వైద్య ఆరోగ్యశాఖాధికారులు

by Disha Web Desk 20 |
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన వైద్య ఆరోగ్యశాఖాధికారులు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, క్లీనిక్‌లల్లో తనిఖీలకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపాలిటీ, అగ్నిమాపక, వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోండా ఆస్పత్రులు నిర్వహించడమే కాకుండా, ఆయుర్వేద వైద్యులతో అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఫస్ట్‌ ఎయిడ్‌ చేయాల్సిన ఆర్‌ఎంపీలు వైద్యులుగా చలామణి అవుతూ గుట్టుగా అబార్షన్లు, గర్భిణులకు ప్రసవాలు, గర్భసంచి తొలగింపు వంటి చికిత్సలు చేస్తున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.

అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయా ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్​ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవల మౌకిక ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లేని, రిజిస్ట్రేషన్లు రెన్యూవల్‌ చేసుకోని, పీసీబీ, ఫైర్‌, బయోమెడికల్‌ వేస్టేజ్‌ సర్టిఫికెట్లు లేని ఆస్పత్రులకు జారీ చేసిన షోకాజు నోటీసులపై స్పష్టత ఇవ్వక పోవడంతో వాటిపై చర్యలు కూడా నిలిచిపోయాయి.

ఆరు వేలకుపైగా ఆస్పత్రులు...

హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలో ఆరు వేలకుపైగా స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ, జనరల్‌ నర్సింగ్‌హోమ్స్‌, క్లీనిక్‌లు, డయాగ్నోస్టిక్స్‌, దంత వైద్యశాలలు, ఆయుర్వేద ఆస్పత్రుల ఉన్నాయి. వీటిలో నాలుగు వేల ఆస్పత్రులకు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు పొందిన ఆస్పత్రుల్లోనూ చాలా వాటికి బిల్డింగ్‌ పర్మిషన్‌, ఫైర్‌, పీసీబీ, బయెమెడికల్‌ వేస్టేజ్‌ సర్టిఫికెట్లు లేవు. కొన్ని ఆస్పత్రుల్లో ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతున్నారు.

ఆర్‌ఎంపీలు ఆపరేషన్లు చేస్తున్నారు. రోగుల ప్రాణాలను హరిస్తుండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీ సుకుంది. ఆ మేరకు సెప్టెంబర్‌ 22 నుంచి ఆయా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్‌పై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సైతం డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రభుత్వ మెడికల్‌ ఆఫీసర్లతో ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రులు, క్లీనిక్‌ల్లో తనిఖీలు చేపట్టింది. 25 బృందాలు కేవలం వా రం రోజుల్లోనే 1600 ఆస్పత్రుల్లో మాత్రమే తనిఖీలు చేపట్టాయి. మిగిలిన వాటిల్లోనూ తనిఖీలు చేపట్టాలని భావించే లోపే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

ఒత్తిళ్లకు తలొగ్గి.. తనిఖీలు నిలిపివేత...

రంగారెడ్డి జిల్లాలో 1800పైగా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఇప్పటి వరకు 1500 ఆ స్పత్రులు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు పొందాయి. తనిఖీ బృందాలు ఇప్పటి వరకు 600పైగా ఆస్పత్రులను తనిఖీ చేసి, 126 ఆస్పత్రులు, క్లీనిక్‌లకు షోకాజు నోటీసులు జారీ చేశాయి. మరో 13 ఆస్పత్రులను సీజ్‌ చేశారు. మెజార్జీ ఆస్పత్రులు ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి బంధువులకు సంబంధించినవే కావడం, నర్సింగ్‌ హోమ్‌లు, డయాగ్నోస్టిక్స్‌, క్లీనిక్‌లు నిర్వహించే ఆర్‌ఎంపీలు కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధాలు కలిగి ఉండటం, వీళ్లంతా కలిసి ఒత్తిడి తెస్తుండటంతో చివరకు వైద్య ఆరోగ్యశాఖ తలొంచక తప్పని పరిస్థితి.

Next Story

Most Viewed