- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ డాక్యుమెంట్లతో రూ.కోట్ల భూముల హాంఫట్
అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జోరందుకుంది. కేటుగాళ్లు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు గుర్తించారు. అనుమానం ఉన్న ప్రతి డాక్యుమెంట్‌ను విచారణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జోరందుకుంది. కేటుగాళ్లు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు గుర్తించారు. అనుమానం ఉన్న ప్రతి డాక్యుమెంట్‌ను విచారణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లలకు పాల్పడిన సబ్‌రిజిస్ట్రార్లతో పాటు సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లను సైతం పోలీసులు తమ కార్యాలయాలకు పిలిపించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అవినీతికి పాల్పడిన కొందరు సబ్‌రిజిస్ట్రార్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
రూ.వేల కోట్లు కాజేసే స్కామ్..
మేడ్చల్ జిల్లాలోని 12 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో జరిగిన ఫేక్ రిజిస్ట్రేషన్ల ఆస్తుల విలువ దాదాపు రూ.5 వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఎక్కడైతే ఆన్‌లైన్ కాకుండా మాన్యువల్ డాక్యుమెంట్లు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని అచ్చుగుద్దినట్టు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేసి, ఈ ఫేక్ డాక్యుమెంట్లన్నింటినీ చూపి దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఇటివల జిల్లాలో జరిపిన ఏసీబీ తనిఖీల్లో బయటపడినట్లు సమాచారం. నకిలీ రిజిస్ట్రేషన్లతో పాటు మార్ట్‌గేజ్‌లు కూడా పెద్ద ఎత్తున చేసినట్లు తెలిసింది. భూములకు సంబంధించిన అసలైన వారికి తెలియకుండా మాఫియా బృందమే అందులోని సభ్యులు ఒకరికొకరు తనఖా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉదంతాలు బయటకు వస్తున్నాయని విచారణ అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా ఈసీలో ఫలానా వ్యక్తి తనఖా జరిగినట్టుగా కనిపిస్తుండడంతో కొనుగోలు చేసే వారిని ల్యాండ్ మాఫియా తేలిగ్గా బురిడీ కొట్టిస్తున్నారని పేర్కొంటున్నారు.
భూ వివాదాలు అనేకం..
ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ భూమిని అమ్మకానికి పెడుతారు. డబ్బు పుచ్చుకుని అమాయకులకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కానీ తాము మోసపోయామని బాధితులకు తెలుస్తుంది. అసలు భూ యజమానులు, కొనుగోలు చేసిన భూ యాజమానులు ఘర్షణ పడి కోర్టులకు చేరతారు. ఇలాంటి వ్యవహారాల్లో ఈ మాఫియా మాత్రం ఎదురు డాడి చేస్తోంది. అదేమంటే.. వాస్తవ యాజమానే ఎవరి దగ్గరో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని కథ రక్తి కట్టిస్తారు. ఇరువురు గొడవలు పడి కోర్టులో తేల్చుకోవడానికి ఏళ్ల సమయం పడుతోంది. ఈ లోపు ల్యాండ్ మాఫియా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. అయితే ఫేక్ డాక్యుమెంట్ల సృష్టికర్తలతో పాటు రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపినట్లయితే మేడ్చల్ జిల్లాలో పెద్ద భూ కుంభకోణమే బయటపడనుందని పలువురు ఉద్యోగులే తెలియజేస్తున్నారు.
విచారణలో నిగ్గు తేలేనా..?
అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు కలిసి రూ.కోట్ల విలువైన భూములకు ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే, సర్కారు ఆదాయానికి భారీ మొత్తంలో గండికొట్టారు. బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారులే మాఫియా అవతారం ఎత్తి అక్రమాలకు లైసెన్స్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. తవ్వే కొద్ది సబ్‌రిజిస్ట్రార్ల అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అధికారులు రెండేళ్ల వ్యవధిలోనే రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమ రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడిన అధికారులు కొందరు తనకేమీ తెలియదన్నట్లుగా ఆ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఎదుట అమాయక చక్రవర్తులుగా నటించినట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికార పార్టీ నాయకులతో సచివాలయంలో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, తన ముఠా సభ్యులు తమను కాపాడుతారన్న ధీమాతో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసిన అధికారులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






