అక్రమ నిర్మాణాల తొలగింపు అంతంతే?

by Ajay Maddhiboyina |

అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ తాత్కాలికమేనా? లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారా ? రాజకీయ నాయకులతో రాజీ కుదిరించుకున్నారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

అక్రమ నిర్మాణాల తొలగింపు అంతంతే?
X

దిశ, మీర్ పేట్ : అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ తాత్కాలికమేనా? లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారా ? రాజకీయ నాయకులతో రాజీ కుదిరించుకున్నారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ ఆర్సీఐ ప్రధాన రహదారి పక్కనే మిథిలా నగర కాలనీలో నాలా బఫర్ జోన్ లో కింద నాలా, భవనం పైన హై టెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం స్థలం ఒక చోట చూపించి నిర్మాణం మాత్రం మరో దగ్గర చేపడుతున్నారు. కానీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నోటీసులు జారీ చేసినా బేఖాతర్

నాలా దగ్గర నిర్మాణం చేపట్టవద్దని గతంలో మున్సిపల్ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. అయినా నిర్మాణదారులు వాటిని పట్టించుకోకుండా భవనాలు నిర్మిస్తున్నారు. దీంతో ఈ నెల 3వ తేదీన అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ నాగమణి తన సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బందిని తీసుకెళ్లి నిర్మాణాలు కూల్చివేస్తుండగా ఓ రాజకీయ నాయకుడి జోక్యంతో సాయంత్రం సమయంలో కమిషనర్ నుంచి టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే అధికారికి ఫోన్ రావడంతో పనులు నిలిపివేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

మాజీ ప్రజా ప్రతినిధి జోక్యంతో ఆగిన కూల్చివేతలు?

అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ ఆ భవనం దగ్గరికి వెళ్లి సిబ్బందిని కూల్చివేతలు ఆపాలని చెప్పారు. దీంతో వారు కమిషనర్ చెప్తే కూల్చివేతలు ఆపుతామని ఆయనకు తెలిపారు. ఈ క్రమంలో ఆ రాజకీయ నాయకుడు అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ని కలిసి తాను మాజీ కార్పొరేటర్ ని అని, ఆ భవనాన్ని ఎందుకు కూల్చుతున్నారని, తాను చాలామంది కమిషనర్లను చూశాను అంటూ ఆమెతో వాగ్వాదం చేశారని, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ నాయకుడు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిన కొద్దిసేపటికి కమిషనర్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఫోన్ చేసి కూల్చివేతలు ఆపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఓ నాయకుడు తమ పనులు చేసుకోకుండా అడ్డుపడుతున్నారని కమిషనర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

Next Story